Begin typing your search above and press return to search.

కేసీఆర్ కరోనాకు ఆ 40 నిమిషాలే కారణమా?

By:  Tupaki Desk   |   20 April 2021 4:04 AM GMT
కేసీఆర్ కరోనాకు ఆ 40 నిమిషాలే కారణమా?
X
భయపడిందంతా నిజమైంది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళలో.. వాస్తవ పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల్లో గెలుపు కోసం.. భారీ బలప్రదర్శన.. అది కూడా లక్ష మందితో సభ అంటే మాటలు కాదు. ఇలాంటి ప్రాణాంతక సవాల్ ను తీసుకున్న కేసీఆర్ తీరును చాలామంది తప్పు పట్టారు. ఎంత ఎన్నికలు అయితే మాత్రం.. మరీ ఇంత భారీగా సభ అవసరమా? అన్న మాట పలువురి నోటి నుంచి వినిపించాయి. ఒకసారి అనుకుంటే.. అనుకున్నట్లు జరిగిపోవాలన్న పట్టుదలతో ఉండే కేసీఆర్.. తాను అనుకున్నట్లే సభను భారీగా నిర్వహించారు. సక్సెస్ చేశారు. ఆ ఆనందంతో ఫామ్ హౌస్ కు వెళ్లారు.

సభ జరిగిన ఆరో రోజుకే కేసీఆర్ కు పాజిటివ్ అన్న విషయం తేలింది. అంటే.. కచ్ఛితంగా సభ కారణంగానే ఆయన్నుకరోనా పట్టేసిందన్నది ఖాయమని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. ఒక ఆసక్తికర అంశాన్ని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కు కరోనా రావటానికి కారణం.. హాలియా సభకు ముందుగా ఏర్పాటు చేసిన సమావేశంగా చెబుతున్నారు.

సభను సాయంత్రం ఆరు గంటల వేళలో నిర్వహించటం.. వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో రోడ్డు మార్గానికి చేరుకున్నారు. పొట్టిచెల్మ వద్ద ఇరిగేషన్ శాఖకు చెందిన గెస్ట్ హౌస్ లో ఆయన కొద్దిసేపు ఉన్నారు. ఈ సందర్భంగా కొంతమందితో కలిసి ఆయన భేటీ అయ్యారు. దాదాపు 40నిమిషాల పాటు ఈ సమావేశం సాగినట్లు చెబుతారు. దీనికి మంత్రులు జగదీశ్ రెడ్డి.. తలసానితో పాటు సాగర్ నియోజకవర్గ నేతలు హాజరయ్యారు. సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి సారు ముఖానికి మాస్కు లేదని చెబుతున్నారు. కరోనాకు ఇక్కడే ఎక్కువగా అవకాశం ఉందంటున్నారు.

ఇక.. రెండో అవకాశం హాలియాలో నిర్వహించిన సభా వేదికగా చెప్పొచ్చు. ఎందుకంటే.. సభా వేదిక మీద 50 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి స్టేజ్ మీదకు వచ్చే వేళలో.. ఆయన ముఖానికి మాస్కు ఉన్నా.. వేదిక మీదకు రాగానే మాస్కును తీసుకొని పక్కన పెట్టేశార. వేదిక మీద ఉన్న వారిలో ఎక్కువ మంది ముఖానికి ఉన్న మాస్కునుకిందకు జార్చి ఉంచారే కానీ.. దాన్ని పెట్టుకోవాల్సిన తీరులో పెట్టుకున్నది లేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు.. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పక్కనే ఉన్నారు.

స్పీచ్ ఇవ్వటానికి ముందు తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా పాజిటివ్ కావటం గమనార్హం. కేసీఆర్ కు పాజిటివ్ కావటానికి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖాయమని.. క్లోజ్ డ్ రూపంలో నిర్వహించిన సమావేశమే కోవిడ్ వ్యాపించటానికి ఎక్కువ అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.