Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ మూడే కీలకమా ?

By:  Tupaki Desk   |   19 April 2022 7:31 AM GMT
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ మూడే కీలకమా ?
X
తొందరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు, కూటములు కసరత్తు మొదలుపెట్టేశాయి. రాబోయే జూలైలో రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగబోతోంది. ఎన్డీయే కూటమి తరపున తాము నిలబెట్టే అభ్యర్థి రాష్ట్రపతి కావాలని సహజంగానే నరేంద్ర మోడీకి ఉంటుంది. కానీ మోడీ ప్రయత్నాలను దెబ్బకొట్టి తాము ప్రతిపాదించే అభ్యర్ధినే రాష్ట్రపతిగా ఎంపికయ్యేట్లు చూడాలని ఎన్డీయేతర పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ మొత్తం ప్రక్రియలో మూడు పార్టీలు మాత్రమే బాగా కీలకమయ్యేట్లున్నాయి. అవేమిటంటే టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ పార్టీలు. ఇపుడు ఎన్డీయే బలం చూస్తే 48.9 శాతం ఉంది. రాష్ట్రపతిగా ఎన్నిక అవ్వాలంటే కచ్చితంగా 51 శాతం ఓట్లు వచ్చితీరాలి.

ఇదే సమయంలో నాన్ ఎన్డీయే పార్టీల మొత్తం బలం 51.1 శాతంగా ఉంది. అంటే ఎన్డీయేకి మరో 1.1 శాతం ఓట్లు చాలా అవసరం. అయితే నాన్ ఎన్డీయే పార్టీలన్నీ కలుస్తాయనే నమ్మకం లేదు. ఒకవేళ కలిస్తే మాత్రం ఎన్డీయే కూటమి అభ్యర్ధి ఓడిపోవటం ఖాయం.

ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓడిపోతే అది మోదీ వ్యక్తిగత ఓటమే అవుతుంది. అందుకనే ఇటు నరేంద్ర మోడీ, అటు నాన్ ఎన్డీయే పార్టీలు రాష్ట్రపతి ఎన్నికను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. లోక్ సభలో బీజేపీకి మంచి మెజారిటీ ఉన్నా రాజ్యసభలో అంత స్థాయిలో లేదు. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా బీజేపీ బలం అంతంత మాత్రమే. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీలో గెలిచింది కాబట్టే ఈమాత్రమైనా బలముంది.

ఈ నేపధ్యంలోనే ఇటు ఎన్డీయేలోను లేకుండా అటు యూపీయే లేదా నాన్ యూపీయే కూటమిలో లేకుండా ఉన్న పార్టీలు మూడే. పైన చెప్పుకున్నట్లు వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ ఓట్లు చాలా కీలకమయ్యాయి. వీటిల్లో టీఆర్ఎస్ ఓట్లు ఎన్డీయే కూటమికి పడే అవకాశం దాదాపు లేదు.

అలాగని యూపీఏ లేదా, నాన్ ఎన్డీయే పార్టీలకు పడుతుందని కూడా చెప్పలేం. మిగిలింది బీజేడీ, వైసీపీ మాత్రమే. వీటిల్లో వైసీపీ ఓట్లు ఎన్డీయేకి పడే అవకాశముంది. చివరగా బీజేడీ ఆలోచనేంటో బయటపడలేదు. ఈ మూడింటిలో ఏ ఒక్కపార్టీ మద్దతిచ్చినా ఎన్డీయే కూటమి అభ్యర్ధే రాష్ట్రపతిగా ఎంపికైపోవటం ఖాయం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.