Begin typing your search above and press return to search.

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ఇది చదవాల్సిందే

By:  Tupaki Desk   |   28 Sep 2019 1:30 AM GMT
స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ఇది చదవాల్సిందే
X
మనిషి బతకడానికి ఏమేం కావాలి? తిండి.. గాలి.. నీరు.. ఇవి లేకుండా మనిషి బతకలేడు. ఐతే ఇప్పుడు వీటి తర్వాతి స్థానాన్ని మొబైల్ ఆక్రమిస్తోంది. నూటికి నూరు శాతం మందికి అని చెప్పలేం కానీ.. ఇప్పుడు మొబైల్ వాడని వాళ్లు కనిపిస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. మొబైల్ వాడకం దారుల్లో మెజారిటీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నవాళ్లే. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఫోన్ పెద్ద వ్యాపకం అయిపోతోంది. లేవగానే మొబైల్ ముఖం చూడాలి. తర్వాత ఏ పని చేస్తున్నా మధ్య మధ్యలో ఫోన్ చేతపట్టుకోవాలి. ఏమాత్రం ఖాళీ ఉన్నా ఫోన్లో మునిగిపోవాలి. మన వృత్తి కూడా మొబైల్‌తోనే ముడిపడి ఉంటోంది. ఇక రాత్రి ఇంటికొచ్చాక.. పడుకునే ముందు కూడా మొబైల్‌ చూడటం మామూలే. ఇంతగా మొబైల్ వినియోగిస్తూ.. మన వ్యక్తిగత జీవితాన్ని దానికి ఎటాచ్ చేయడం వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదని.. మున్ముందు మన జీవనాన్ని మొబైల్ విపరీతంగా ప్రభావితం చేయబోతోందని అంటున్నారు నిపుణులు. అతిగా మొబైల్ వినియోగం వల్ల వచ్చే శారీరక, మానసిక సమస్యల సంగతి తర్వాత.. మన ప్రైవసీని దెబ్బ తీసి వ్యక్తిగత జీవితాన్ని బట్టబయలు చేసే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో ఎన్నో ఫీచర్లు, ఎన్నో యాప్‌‌లు. ఏ యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నా.. మొదట మీ కాంటాక్ట్స్, ఫొటోలు, ఇతర సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవచ్చా అన్న ప్రశ్న ఎదురవుతుంది. అందుకు అంగీకరించకుంటే యాప్ ఇన్‌స్టాల్ కాదు. లేదా యాప్‌ వల్ల పూర్తి ప్రయోజనం ఉండదు. దీంతో అన్నిటికీ ఓకే అంటాం. ఇంకేముంది మన ఫోన్లోని సమాచారం మొత్తం యాప్‌కు అప్పగించేస్తాం. ఇంకేముంది మన గురించి, మన దగ్గరున్న సమాచారం గురించి మనకు కూడా తెలియనంతగా మరో చోటికి చేరిపోతుంది. గత వారం మనం ఎవరితో ఎక్కువసార్లు మాట్లాడామో మనకు గుర్తుండకపోవచ్చు. కానీ ట్రూ కాలర్ అనే యాప్ మాత్రం ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకుంటుంది. మనం తరచుగా ఏ బార్‌కు వెళ్తామో.. ఏ కాఫీ షాప్‌లో సమయం గడుపుతామో ఇంట్లో వాళ్లకు సమాచారం లేకపోవచ్చు. కానీ గూగుల్ మ్యాప్ దాన్ని పసిగట్టి మనకు హింట్స్ ఇస్తూ ఉంటుంది. ఏకాంతంగా ఉన్న సమయంలో మనం ఏ వెబ్ సైట్ ఓపెన్ చేస్తామో.. దేని మీద అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తామో మనకు మాత్రమే తెలుసనుకుంటాం. కానీ బ్రౌజర్ ద్వారా అంతా ఇంటర్నెట్లో నిక్షిప్తమై ఉంటుుంది. ఇలా కేవలం మన మొబైల్ వినియోగాన్ని బట్టి మనమేంటో చెప్పేసేలా సమాచారం అంతా నిక్షిప్తం అవుతూ ఉంటుంది. దీని వల్ల దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. అవేంటో ఒకసారి చూద్దాం పదండి.



* మన ఫోన్లో ట్రూ కాలర్ యాప్ ఉంటుంది. కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే ముందే అలెర్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫోన్ తీయాలో వద్దో నిర్ణయించుకుంటాం. ప్రమోషనల్ కాల్స్ అనే సంకేతం వస్తే కట్ చేస్తాం. మరికొన్ని రకాలుగా అప్రమత్తం కావడానికి ట్రూ కాలర్ ఉపయోగపడుతుంది. కానీ ట్రూ కాలర్‌ యాప్ వేసుకోవడం ద్వారా ఇదే తరహాలో మన సమాచారం కూడా ఇస్తున్నామనే విషయం గుర్తుంచుకోవాలి. మన గురించి సమాచారంతో వేరేవాళ్లకు కూడా మన గురించి సంకేతాలిస్తుంటుంది ట్రూ కాలర్. అంతటితో పరిమితం అయితే పర్వాలేదు. మన సమాచారాన్ని ఈ యాప్ ఎంత వరకు భద్రంగా ఉంచుతుందన్నది సందేహం. గతంలో ఒక ఉగ్రవాద సంస్థ.. ట్రూ కాలర్‌ నుంచి లక్షల సంఖ్యలో కాంటాక్ట్స్ దొంగిలించడం సంచలనం రేపింది. ఫేస్ బుక్ లాంటి పెద్ద సంస్థ మన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంది. వినియోగదారుల నుంచి కాంటాక్ట్స్‌ సంపాదించి.. వాటిని ప్రమోషనల్ కాల్స్ చేసే, మెసేజ్‌లు పంపే సంస్థలకు యాప్స్ భారీ మొత్తాలకు అమ్ముకోవడం కొత్తేమీ కాదు.

* మన ఫోన్ నంబరు, చిరునామా వంటివి పొరబాటున విద్రోహ శక్తులకు దొరికితే అంతే సంగతులు. బ్యాంకు సిబ్బంది పేరుతో ఫోన్ చేస్తారు. మన వివరాలన్నీ చెప్పి.. మనకు సందేహం రాకుండా చేస్తారు. నెట్ బ్యాాంకింగ్ పాస్ వర్డ్ మార్చమని చెబుతారు. క్రెడిట్ కార్డ్ వివరాలు అడుగుతారు. ఓటీపీ పంపాం చెప్పమని అంటారు. కాసేపటికే అకౌంట్లో డబ్బులు మాయం అవుతాయి.

* సోషల్ మీడియా అకౌంట్లలో మన సమాచారం, అభిరుచుల్ని బట్టి యాప్స్ లో అప్ డేట్ చేసే వివరాల్ని బట్టి మన అభిరుచుల్ని గమనించి కాల్స్ రావడం, మెసేజ్‌ల రూపంలో వ్యాపార ప్రకటనలు పంపడం.. రాజకీయ పార్టీలతో పాటు వివిధ సంస్థల నుంచి కాల్స్ రావడం చూస్తుంటాం. మన నంబర్లు వివిధ రకాల వ్యక్తులకు, సంస్థలకు ఎలా వెళ్తున్నాయన్నది మనకు అర్థం కాదు. ఇంటర్నెట్లో ఒకసారి ఒక వస్తువు కోసం వెతికితే.. ఆ తర్వాత మన సోషల్ మీడియా అకౌంట్లలో అలాంటివి, మన అభిరుచులకు తగ్గ ప్రకటనలే డిస్ ప్లే కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని గుర్తించేవాళ్లు తక్కువ. మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అనలైజ్ చేసి అందుకు తగ్గ ప్రకటనలు డిస్ ప్లే అయ్యేలా చేస్తాయి సంస్థలు.

* మనం రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తాం. ఆ వివరాలేమీ ఆన్ లైన్లో నమోదు చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే.. గూగుల్ నుంచి కొన్ని రోజుల తర్వాత అలెర్ట్ వస్తుంది. ఇంటికి బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది అని. మనం తరచుగా చేసే ప్రయాణాన్ని బట్టి మనం ఏ సమాచారం ఇవ్వకపోయినా సరే.. గూగుల్ ఇలా అలెర్ట్ చేస్తుంది. గూగుల్ యాప్‌లో ఒకసారి ఇంటి అడ్రస్ వెతికామంటే చాలు.. అది అక్కడ నమోదైపోతుంది. దాన్ని అనుసరించి మన ఇల్లెక్కడ, ఆఫీస్ ఎక్కడ, తరచుగా ఎక్కడెక్కడ తిరుగుతాం అనే వివరాలన్నీ గూగుల్లో నమోదైపోతూ ఉంటాయి.

* మెడికల్ షాక్‌కు వెళ్లామంటే బిల్ చేసేటపుడు కచ్చితంగా ఫోన్ నంబరు అడుగుతారు. ఇవ్వమన్నా ఊరుకోరు. కచ్చితంగా ఇవ్వాలంటారు. ఆ డేటా అక్కడి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్తుంది. వాళ్లు మా ల్యాబ్‌లో పరీక్షలు చేసుకోండి, ఆఫర్లున్నాయంటూ మెసేజ్‌లు పంపుతారు. కాల్స్ చేస్తారు. ఒక షాపింగ్ మాల్‌కు వెళ్తాం. అక్కడ నంబర్ నమోదు చేస్తాం. వాళ్ల నుంచి ఇంకెక్కడికో మన నంబర్ వెళ్తుంది. వ్యక్తిగత వివరాల్ని సేకరించడాన్ని విదేశాల్లో తీవ్ర నేరంగా పరిగణిస్తారు. తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను కేంబ్రిడ్జ్ ఎనలిటికాతో పంచుకున్నందుకు అమెరికా ప్రభుత్వం ఫేస్ బుక్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కానీ మన దేశంలో ఇలాంటి వాటిని నియంత్రించేందుకు పటిష్టమైన చట్టాలే లేవు. కేవలం హెచ్చరికలతో సరిపెడతారు.