Begin typing your search above and press return to search.

యూపీ, గుజ‌రాత్‌లు బీజేపీని భ‌య‌పెడుతున్నాయా?

By:  Tupaki Desk   |   12 Sept 2021 2:03 PM IST
యూపీ, గుజ‌రాత్‌లు బీజేపీని భ‌య‌పెడుతున్నాయా?
X
రెండు కీలక రాష్ట్రాలు బీజేపీని భ‌య‌పెడుతున్నాయా? వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గనున్న ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీకి తీవ్ర ఇబ్బందిక‌రంగా మారాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వీటిలో ఒక‌టి సాక్షాత్తూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా(యూపీలోని వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మోడీ వ‌రుస‌గా గెలిచారు), మ‌రొక‌టి.. ప్ర‌ధాన మంత్రి మోడీ సొంత రాష్ట్రం ఆయ‌న వ‌రుస‌గా మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా విజ‌యం ద‌క్కించుకున్న గుజ‌రాత్. అయితే.. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇర‌కాటంలో ప‌డిపోయింది.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా మూడోసారి .. కూడా కేంద్రంలో పాగా వేయాలంటే.. ఈ రెండు రాష్ట్రాలూ.. బీజేపీకి అత్యంత ప్ర‌ధానం. ఎంపీ స్థానాల ప‌రంగా ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాలు ఈ రెండే. పైగా ఇక్క‌డ గ‌త 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ గుండుగుత్తుగా ఎక్కువ ఎంపీ స్థానాల‌ను ద‌క్కించుకుని కేంద్రంలో ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా అధికారంలోకి తీసుకురావ‌డం వెనుక కూడా ఈ రెండు రాష్ట్రాల పాత్ర ఎంతో ఉంది. అయితే.. కొన్నాళ్లుగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పాల‌న గాడి త‌ప్పుతోంద‌నే విమ‌ర్శ‌లు.. వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో కొన్ని స‌ర్వేలు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

దీంతో గుజ‌రాత్‌లో ఇప్ప‌టికిప్పుడు ప‌రిస్థితులు స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముఖ్య‌మంత్రి రూపానీని గుజ‌రాత్ నుంచి త‌ప్పించారు. దీనివ‌ల్ల పార్టీ ప‌రిస్థితి మెరుగ‌వుతుంద‌ని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కానీ క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఇప్ప‌టికే చేజారి పోయింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నా రు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో బాగానే వ్య‌వ‌హ‌రించినా.. సెకండ్ వేవ్ స‌మ‌యంలో మ‌ర‌ణాలు దాచార‌ని.. ప్రైవేటు ఆసుప‌త్రుల దోపిడీని క‌ట్ట‌డి చేయ‌లేక పోయార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కేంద్రం నుంచి సాయం అందించినా.. కొంద‌రు మ‌ధ్య‌లోనే కాజేశార‌నే విమ‌ర్శ‌లు రావ‌డం.. బీజేపీకి త‌ల‌నొప్పిగా మారింది.

మ‌రీ ముఖ్యంగా బీజేపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు రోడ్డెక్కాయి. ప్ర‌జ‌లకు మేలు చేస్తున్నామ‌ని చెబుతున్నప్ప టికీ.. ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు విష‌యంలో జ‌వాబుదారీ త‌నంలోపించ‌డం .. బీజేపీకి తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది. ఇక‌, యూపీ విష‌యానికి వ‌చ్చినా.. ఇవే స‌మ‌స్యలు వెంటాడుతున్నాయి. పైకి మాత్రం రామమందిరం నిర్మాణం ఒక్క‌టే యూపీలో బీజేపీకి క‌నిపిస్తున్న ఆశావ‌హ దృక్ఫ‌థం. కానీ, మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షాలు ఏక‌తాటిపైకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో సీఎం.. యోగిపై పెరిగిన వ్య‌తిరేక‌త‌ను ఎంత దాచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. దాగ‌ని వ్య‌వ‌హారంగా మారింది.

ఈ ప‌రిణామాల‌తో కేంద్రంపై ఈ రెండు రాష్ట్రాలు ప్ర‌భావం చూపించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. దీని నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. కేవ‌లం ఏడాది మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌డం.. ఇప్ప‌టికే వ్య‌తిరేక‌త పెరిగిపోవ‌డం వంటి ప‌రిణామాలు.. బీజేపీకి తీవ్ర సంక‌టంగా మార‌గా.. మోడీకి తిరిగి అధికారం ద‌క్కే అవ‌కాశాలు స‌న్న‌గిల్లేలా చేస్తుండ‌డం మ‌రింత విప‌త్క‌రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.