Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. ఏపీలో వలంటీర్లు ప్రజలను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా?

By:  Tupaki Desk   |   22 Dec 2022 8:04 AM GMT
షాకింగ్‌.. ఏపీలో వలంటీర్లు ప్రజలను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వలంటీర్ల ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్లకే చేరుస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. మరోవైపు వలంటీర్లను వాడుకుని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో వలంటీర్లను ఎన్నికల విధులకు వాడొద్దని ఎన్నికల సంఘం వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అయినప్పటికి రాష్ట్రంలో ఉన్న 2.67 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను ఉపయోగించుకుని ప్రజల నుంచి అన్ని వివరాలను జగన్‌ ప్రభుత్వం సేకరిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వలంటీర్లు వివిధ పథకాల కోసం లబ్ధిదారుల బయోమెట్రిక్‌ సేకరిస్తున్నారని.. దీని ద్వారా ప్రజల సమస్త సమాచారం ప్రభుత్వం వద్ద నిక్షిప్తమై ఉంటుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

తాజాగా ఏపీ ప్రభుత్వం 12 అంశాలపై వలంటీర్లతో ఏపీ ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ క్రమంలో వలంటీర్లు అడుగుతున్న ప్రశ్నలు ప్రజలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని ప్రధాన మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రజల నుంచి వివాహేతర సంబంధాలున్నాయా? ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్నారా? వీటికి సంబంధించి ఏమైనా కేసులు దాఖలయ్యాయా? అని వలంటీర్లు ప్రజల నుంచి అభ్యంతర ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతున్నట్టు ప్రధాన మీడియా తన కథనాల్లో పేర్కొంది.

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న మహిళా పోలీసులతో కలిసి వలంటీర్లు ప్రజల నుంచి ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు అడుగుతున్నట్టు సమాచారం. అలాగే అంతకుముందు పాత కేసులు ఏమైనా ఉన్నాయా? వాటి విచారణ ఎంత వరకు వచ్చింది? ఎవరైనా జైలుపాలయ్యారా? వంటి ప్రశ్నలు అడుగుతున్నట్టు చెబుతున్నారు.

మహిళా పోలీసులు వలంటీర్లతో కలిసి తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లి ఈ వివరాలు రాబడుతున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలు అందించాల్సిన వాళ్లకి ఈ వివరాలు ఎందుకని ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని సమాచారం.

ఇవేకాకుండా ఆ ఇళ్లల్లోని వ్యక్తులకు సంబంధించి ఆస్తి, సరిహద్దు వివాదాలు, గృహహింస కేసులు, మద్యపాన సేవనం, ఈవ్‌టీజింగ్, బహిరంగ మద్యపానం, కుల, మత, రాజకీయ విరోధాలకు సంబంధించిన కేసుల వివరాలూ సేకరిస్తున్నారు. ఇలా మొత్తం 12 రకాల అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడుతున్నారని చెబుతున్నారు.

ఇలా ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని నిర్దేశిత నమూనాలో రూపొందించి రోజూ సాయంత్రం 7 గంటలకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో)కి అందజేస్తున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, తమకు గిట్టనివారిని వేధించేందుకు, కేసుల్లో ఇరికించేందుకే ప్రజలకు సంబంధించిన అత్యంత సున్నితమైన, వ్యక్తిగతమైన వివరాలను వలంటీర్లు, పోలీసుశాఖ సేకరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ సమాచారాన్ని వాలంటీర్లు తమవద్ద పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.