Begin typing your search above and press return to search.

విజయవాడ ఎంపీగా కొత్త ముఖాన్ని చూడబోతున్నామా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 11:30 AM GMT
విజయవాడ ఎంపీగా కొత్త ముఖాన్ని చూడబోతున్నామా?
X
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లోక్‌ సభా స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఉత్కంఠ వీడటం లేదు. అన్ని ప్రధాన పార్టీలకు అభ్యర్థుల కొరత ఉండటం విజయవాడ నియోజకవర్గంలో విశేషంగా మారింది.

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పీవీపీ ప్రసాద్‌ ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కేశినేని నానిపై ఓటమి పాలయ్యారు. టీడీపీ తరఫున కేశినేని నాని ఇక్కడ నుంచి వరుసగా రెండు పర్యాయాలు 2014, 2019ల్లో ఎంపీగా గెలుపొందారు.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లోనూ కేశినేని నానియే విజయవాడ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో టీడీపీ అధిష్టానంపై చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులు తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మీడియా ముందు వెళ్లగక్కడం, సోషల్‌ మీడియాలోనూ పోస్టులు చేయడం చేస్తున్నారని టీడీపీ వర్గాలే ఆయనపై మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేశినేని నానిని పక్కనపెట్టే ఉద్దేశంలో టీడీపీ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని సమాచారం. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉండే కేశినేని చిన్ని ఇటీవల కాలంలో విజయవాడలో తరచూ పర్యటించడం, వంగవీటి రాధాకృష్ణతో భేటీ కావడం సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో టీడీపీ తరఫున విజయవాడలో కేశినేని చిన్ని పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్‌రావు పేరు కూడా వినిపిస్తోంది. గద్దె రామ్మోహన్‌ విజయవాడ నుంచి పోటీ చేస్తే ఆయన భార్య అనురాధకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే సీటు ఇచ్చే చాన్స్‌ ఉందని అంటున్నారు.

మరోవైపు వైఎస్సార్‌సీపీ తరఫున గత ఎన్నికల్లో పీవీపీ ప్రసాద్‌ ఓడిపోయాక ఆయన మళ్లీ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసింది లేదు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీని వైఎస్సార్సీపీ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి సినీ నటుడు నాగార్జునను బరిలోకి దింపుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. నాగార్జునే కాకుండా వైఎస్సార్సీపీ మదిలో పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెబుతున్నారు.

మరోవైపు జనసేన–టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో విజయవాడలో టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారా లేదా జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా అనేది కూడా కీలకమే.

అయితే ఒక్కటయితే ఖాయంగా చెప్పొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసి గెలిచినా కొత్త అభ్యర్థే విజయవాడ ఎంపీగా గెలుస్తారని తేల్చిచెబుతున్నారు. ఈసారి విజయవాడ ఎంపీగా ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.. మనం కొత్త ముఖాన్నే చూడబోతున్నామని స్పష్టం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.