Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నారా?

By:  Tupaki Desk   |   26 July 2021 12:30 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నారా?
X
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలో ఉన్నారా? వారు ఏమీ కొర‌గాకుండా పోతున్నారా? ప్ర‌భుత్వ వైఖ‌రితో తీవ్ర‌స్థాయిలో విసిగెత్తిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధి. అంటే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని, ప‌రిష్క‌రించే వార‌ధి. దేశంలో ఏ పార్టీ నాయ‌కుడైనా.. ప్ర‌జ‌ల‌తో సంబంధం పెట్టుకుని.. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ.. తాను పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇదే రాజ‌కీయం అంటే. అయితే.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఈ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.

అన్నీ నేరుగానే ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు కూడా ప్ర‌భుత్వం నేరుగా స్పంద‌న అనే వేదిక‌ను ఏర్పాటు చేసింది. దీంతో అధికారుల‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధాలు పెరిగాయే త‌ప్ప‌.. నాయ‌కుల‌కు.. ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య రిలేష‌న్ మాత్రం పెర‌గ‌డం లేదు. నిజానికి వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు దాదాపు ప‌దేళ్ల నుంచి పార్టీలో క‌ష్ట‌ప‌డుతున్న నాయ‌కులు ఉన్నారు. వైఎస్ అభిమానులుగా పార్టీలో చేరి.. జ‌గ‌న్‌ను సీఎంను చేసేందుకు అహ‌ర‌హం శ్ర‌మించిన నాయ‌కులు.. ఆర్థికంగా సాయం చేసిన నాయ‌కులు కూడా ఉన్నారు.

ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహంతో ముందుకు వెళ్లిన వైసీపీ అనేక మంది సీనియ‌ర్ల కు, ప‌లువురు జూనియ‌ర్ల‌కు కూడా టికెట్లు కేటాయించి.. ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం ద‌క్కించుకుంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల‌ను వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. నిజానికి ఇంత భారీ సంఖ్య‌లో మెజారిటీ ద‌క్కించ‌కోవ‌డం దేశంలో ఇదే ప్ర‌ధ‌మమ‌నే విశ్లేష‌ణ‌లు వున్నాయి. అయితే.. గెలిచిన త‌ర్వాత‌.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో వారు .. కుదేల‌వుతున్నారు.


నిజానికి గ్రామాల‌ను తీసుకుంటే.. అక్క‌డ నాయ‌కులు చ‌క్రం తిప్పుతారు. ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో ఎమ్మెల్యేనే హీరో. అదేవిధంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో ఎంపీనే అన్నీ! అయితే.. ఇవ‌న్నీ.. ఒక‌ప్పుడు.. జ‌గ‌న్ హ‌యాంలో మాత్రం వీరికి ప‌నిలేకుండా పోయింది. వీరంతా కూడా ఇప్పుడు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే.. ప్ర‌భుత్వం ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా.. ఏ ప‌థ‌కాన్ని ప్రారంభించినా.. నేరుగా.. ముఖ్య‌మంత్రి లైన్‌లోకి వ‌స్తున్నారు. ఒక్క బ‌ట‌న్ నొక్కుతున్నారు. అంతే.. ల‌బ్ధిదారుల ఖాతాల్లో క‌న‌క‌వ‌ర్షం కురుస్తోంది.

మ‌రి మ‌ధ్య‌లో ఈ నేత‌ల‌తో ప‌నికూడా ఉండ‌డం లేదు. ల‌బ్ధిదారులు .. త‌మ ద‌రఖాస్తుల‌ను స్పంద‌న‌లో కానీ.. వ‌లంటీర్ల‌కు కానీ.. ఇస్తే.. అధికారులు ప‌రిశీలించి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారు. వారికి ఆయా ప‌థ‌కాలు అందుతాయి. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. స్పంద‌న‌లో ఫిర్యాదు చేస్తారు.. సంబంధిత అధికారులు ప‌రిష్క‌రిస్తారు. మ‌రి ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ప్ర‌జ‌ల‌కు దాదాపు సంబంధం లేకుండా పోయింది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. విల‌విల్లాడిపోతున్నారు. అంతా అధికారుల చేతిలోనే పెట్టార‌ని.. త‌మ ప్ర‌మేయం లేకుండానే అన్నీ జ‌రిగిపోతున్నాయ‌ని..నాయ‌కులు కుమిలిపోతున్నారు.

ఈ క్ర‌మంలో స‌ద‌రు ప‌థ‌కాలు ప్రారంభం స‌మ‌యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే లేకుండా పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ``మాకు ప్రాధాన్యం లేదు. మా ప్ర‌మేయం లేదు. ఇక‌, మేం ఉండి ప్ర‌యోజ‌నం ఏంటి?`` అనేది వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల మాట‌. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. కులం చూడం, మ‌తం చూడం, పార్టీ చూడం అన్ని ప‌థ‌కాల‌ను అర్హులైన వారికి అందరికీ అందిస్తామ‌ని.. ప్ర‌క‌టించారు. అయితే.. దీనిని తాము ఏదో రాజ‌కీయంగా చెప్పిన మాట‌గా భావించామ‌ని.. దీనిని అడ్డు పెట్టుకుని.. మాకు ప్రాధాన్యం లేకుండా చేశార‌ని.. వాపోతున్నారు.

అంతా.. అధికారులే చూసుకున్నప్పుడు.. బూత్ స్థాయిలో నాయ‌కులు ఎందుకు? క‌మిటీలు ఎందుకు? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. నిజానికి అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోందో.. ఎవ‌రు ల‌బ్ధి దారులో.. ఎవ‌రికి ఏ ప‌థ‌కం అందుతోందో.. కూడా తెలియ‌ని ఎమ్మెల్యేలు ఉన్నారంటే.. ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌పోదు. కానీ, ఇది నిజం. దీంతో స‌ద‌రు ల‌బ్ధి దారుల జాబితాలోపేర్లు లేని అర్హులు.. వ‌చ్చి అడిగితే.. తాము ఏం స‌మాధానం చెప్పాల‌నేది.. వీరి ప్ర‌శ్న‌. దీంతో.. వారు నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా ఉంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నారా? అనే కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు లోక‌ల్‌గా కూడా స్థానిక చానెళ్ల‌లో ఇదే చ‌ర్చ పెడుతున్నారు. కామెంట్లు కూడా భారీ ఎత్తున పేలుతున్నాయి. సో.. దీనిని బ‌ట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.