Begin typing your search above and press return to search.

హేమంత్‌ సోరేన్‌ ఎపిసోడ్ తో కేసీఆర్ తో భేటీకి భయపడతారా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 12:30 PM GMT
హేమంత్‌  సోరేన్‌ ఎపిసోడ్ తో కేసీఆర్ తో భేటీకి భయపడతారా?
X
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎదురైన షాకింగ్ పరిణామం మరో ఆసక్తికర చర్చకు తెర తీసింది. అక్రమ మైనింగ్ విషయంలో ఆయనపై వెల్లువెత్తిన ఆరోపణలు.. ఆ సందర్భంగా ఆయనపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదు అందటం.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి గవర్నర్ సలహా అడగటం వరకు అంతా తెలిసిన ముచ్చటే.

తన వరకు వచ్చిన కంప్లైంట్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సలహా అడిగిన గవర్నర్ కు.. తాజాగా ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన వైనం షాకింగ్ గా మారింది.

ఈ అనూహ్య పరిణామానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ మాత్రం లింకు లేకున్నా.. దీనికి సంబంధం లేని మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి చర్చిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగ మారింది. ఎందుకంటే.. ఈమధ్యనయ దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో గత మార్చిలో జార్ఖండ్ వెళ్లటం.. శిబు సోరెన్ తో పాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను భేటీ కావటం.. ఆ సందర్భంగా తన కుమార్తె కవితను వెంటపెట్టుకొని వెళ్లటం తెలిసిందే.

అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తో భేటీ కోసం కేసీఆర్ తపించినట్లుగా చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు కేసీఆర్ తాను భేటీ అయిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందన్న మాట వినిపిస్తోంది. అందుకు జార్ఖండ్ ఎపిసోడ్ ను తాజాగా ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ తో కలిశారు కాబట్టి.. ఈసీ ఏదో ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని చెప్పలేం కానీ.. ఆయన స్నేహహస్తం చాటిన ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇబ్బందికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు.

మొన్నటికి మొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతతో కలిసి కేసీఆర్ కుమార్తె కవితకు లిక్కర్ స్కాంలో సంబంధాలు ఉన్నట్లుగా బీజేపీ నేతలు ఆరోపించటం.. మరోవైపు హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరగటం తెలిసిందే.

ఇలా ఏదో ఒక చికాకు ఒక ఎత్తు అయితే.. తాను స్నేహహస్తం చాటిన వారికి పదవి పోయే పరిస్థితి రావటం అనుకోకుండా జరిగిందా? మరేమైనా ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తో స్నేహ హస్తాన్ని చాచే వారు కానీ.. ఆయనతో భేటీ అయ్యేందుకు కానీ మక్కువ చూపే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అదెంత వరకు నిజమన్నది కాలమే బదులివ్వాలి.