Begin typing your search above and press return to search.

రాజు గారి బ్రేకులతో మండిపోతున్నారా... ?

By:  Tupaki Desk   |   15 Feb 2022 2:30 PM GMT
రాజు గారి బ్రేకులతో మండిపోతున్నారా... ?
X
వైసీపీలో ఒకే ఒక్కడుగా ఆయన ఉన్నారు. ఎంపీలందు ఆయన కాస్తా వేరయా అంటారు. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. ఆయన ఢిల్లీలో రచ్చ బండ పేరిట డైలీ వైసీపీ సర్కార్ మీద కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఢిల్లీలో రాజు గారు కేవలం కామెంట్స్ చేసి ఊరుకోవడంలేదు. ఒక ఎంపీగా తనకున్న పవర్ తో ఆయన ఏపీ సర్కార్ దూకుడుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోంది అన్న ఫిర్యాదుతో రాజు వైసీపీ సర్కార్ ని బాగానే ఇరకాటంలో పెడుతున్నారుట. ఏపీ విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది అన్నది ఆయన ప్రధాన ఫిర్యాదు. ఏకంగా ప్రధాని ఆఫీస్ కే లేఖలు రాయడం ద్వారా ఏపీలో జరుగుతున్న ఆర్ధిక పరిణామాలను రఘురామక్రిష్ణం రాజు గుది గుచ్చినట్లుగా వివరిస్తున్నారు.

దాంతో కేంద్ర ఆర్ధిక శాఖ వివరణ కోరుతోంది. అంతే కాదు అప్పుల విషయంలో కొత్త ఆంక్షలు కూడా పెడుతోంది. దీంతో వైసీపీ పెద్దలకు మండుకొస్తోందిట. దీని మీద ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసహనానికి గురి అవుతున్నారుట. మా పార్టీకి చెందిన ఒక రోగ్ ఎంపీ ఉన్నారని, ఆయన టీడీపీ ఎంపీలతో కలసి ఇలాంటి నిరాధార ఫిర్యాదులు చేస్తున్నారు అని జగన్ అన్నట్లుగా రాజకీయ వర్గాలలో అయితే ప్రచారం సాగుతోంది.

ఇంతకాలం అంటే దాదాపుగా రెండేళ్లకు పైగా రఘు రామ క్రిష్ణం రాజు విమర్శలు చేస్తున్నా పెద్దగా రియాక్టు కానీ జగన్ ఇపుడు ఇంత ఆగ్రహానికి గురి కావడం అంటే రఘు రామరాజు ఏ రేంజిలో తన ఫిర్యాదుల‌తో ఫలితాలు సాధిస్తున్నారో అర్ధమవుతోంది.

దాంతో ఒక ఎంపీ, తమ పార్టీకి చెందిన వారే ఇలా తనకు ఎదురు నిలిచి తమ ప్రభుత్వ కార్యక్రమాలకు అప్పులు పుట్టకుండా బ్రేకులు వేస్తారని జగన్ ఎన్నడూ ఊహించి ఉండరేమో. దాంతోనే ఆయన తొలిసారి పరుష పదజాలం ఉపయోగించారు అంటున్నారు.

అయితే దీని మీద రఘు రామ క్రిష్ణం రాజు ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ ఏపీలో రోగ్ ఎవరో ప్రజలే తేలుస్తారు అని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీని అప్పుల కుప్ప చేస్తున్న వారు రోగ్ నా లేక ఏపీని కాపాడాలని చూస్తున్న తాను రోగ్ నా అని ఆయన గట్టిగా నిలదేయడం చర్చనీయాంశం అవుతోంది. మొత్తానికి రాజు వైసీపీకి ఎక్కడ కెలకాలో అక్కడ కెలికారు. దీని ఫలితాలు పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాలి.