Begin typing your search above and press return to search.

పవన్ కేడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 10:30 AM GMT
పవన్ కేడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పెద్ద సమస్య ఉంది. ఆయన మరిచిపోతారో, లేక ఆయన తత్వమే అంతో తెలియదు గాని గతంలో మాట్లాడినదానికి విరుద్ధంగా మాట్లాడుతుంటారు చాలా సార్లు. తన మాటలు తనకే తగిలేలా ఉంటాయి. రాజకీయాల్లో ఇది చాలా నష్టం.

అందుకనే తాను ఏమి మాట్లాడాలనే విషయమై పక్కాగా పాయింట్లు రెడీచేసుకుని జనాలముందుకు రావాలి. ఇక్కడే పవన్లో ప్లానింగ్ మిస్సవుతోంది. అందుకనే తానేం మాట్లాడుతున్నారో తనతో పాటు జనాలకు కూడా ఏమాత్రం అర్ధం కావటం లేదు.

ఒకే సమయంలో నాలుగైదు అంశాలను కలిపి మాట్లాడేస్తుంటారు. తిరుపతిలో జరిగిందిదే. ఒకవైపు వైసీపీ, టీడీపీ పార్టీల కొమ్ముకాసేది లేదని స్పష్టంగా ప్రకటించారు. కొద్దిసేపటికే జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అవసరమైతే శతృవుతో అయినా చేతులు కలుపుతామన్నారు. 2014 ఎన్నికల్లో జనసేన మద్దతు కావాలంటే తమ పార్టీ కార్యాలయానికి వచ్చి మర్యాదగా తమతో మాట్లాడాలని చంద్రబాబునాయుడుకి చెప్పినట్లు చెప్పటంలో అర్ధమేలేదు.

తన సోదరుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వటానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబానికి కోవర్టులుగా మారిపోయిన వారే కారణమన్నారు. అసలు ఈ విషయం ఎందుకు ప్రస్తావించారో పవన్ కైనా తెలుసా ? పార్టీని స్థాపించి నడపటం చేతకాక చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసుకున్నది వాస్తవం.

మరప్పుడు పార్టీని కాంగ్రెస్ లో విలీనం కాకుండా పవన్ ఎందుకు అడ్డుకోలేకపోయారు ? చిరంజీవిని రాజకీయంగా నిలబడనీయకుండా చేశారంటు ఇపుడు గోలచేయటంలో అర్ధం లేదు. ఎవరు ఎవరినీ పిలిచి కుర్చీలో కూర్చోబెట్టరు. రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారంటే అది చిరంజీవి వైఫల్యమే గాని దానికి ఇంకెవరో కారణం అని తప్పించుకోలేరు.

మూడో ప్రత్యామ్నాయం కావాలని పవన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. మూడో ప్రత్యామ్నాయం కావాలని అనుకోవాల్సింది పవన్ కాదు జనాలు. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనాలు ఇండిపెండెంట్ అభ్యర్ధులను గెలిపించిన విషయం పవన్ తెలుసుకోవాలి. పెద్ద పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని జనాలు అనుకోబట్టే స్వతంత్ర అభ్యర్ధులను గెలిపించుకున్నారు. కాబట్టి రేపైనా జనాలు అనుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. 2019 ఎన్నికల్లో పవన్ అసెంబ్లీలో అవసరం లేదని జనాలు అనుకోబట్టే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.