Begin typing your search above and press return to search.

కేసీయార్ ను ఢిల్లీకి రాకుండా కుట్ర చేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   30 Nov 2020 12:30 AM GMT
కేసీయార్ ను ఢిల్లీకి రాకుండా కుట్ర చేస్తున్నారా ?
X
‘తాను ఢిల్లీలో అడుగుపెట్టకుండా హైదరాబాద్ లోనే కట్టడి చేసేందుకు కుట్ర చేస్తున్నారు’ ..ఇది తాజాగా బహిరంగసభలో కేసీయార్ చేసిన వ్యాఖ్య. ఇందులో నిజమెంత ?అన్న విషయమే ఇపుడు ఆసక్తిగా మారింది. అసలు కేసీయార్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ? ఢిల్లీకి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు ? ఓసారి చరిత్రను గమనిస్తే కేసీయార్ రాజకీయంపై జాతీయ స్ధాయిలో ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే ఓ స్ధిరమైన అభిప్రాయంతో మాట మీద ఉంటారనే నమ్మకం చాలా మందిలో లేదన్నది వాస్తవం.

ఎందుకంటే 2009లో ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓ ఫ్రంటుగా రాష్ట్రంలో పోటీ చేసిన కేసీయార్ ఎన్నికల ఫలితాలు రాకుండానే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానిని కలిసొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో డెవలప్మెంట్లు జరిగాయి. తాను సిఎం అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు. ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, కర్నాటకలో కుమారస్వామిని కూడా కలిశారు. అయితే తర్వాత ఏమైంది ? ఎవరితోను స్ధిరంగా ఉండరు.

పైగా నరేద్రమోడికి వ్యతిరేకంగా చేతులు కలిపే బృందంలో ఎక్కువమంది గట్టివాళ్ళు లేరు. పశ్చిమబెంగాల్లో మమత ఒక్కళ్ళే బలమైన నేతగా ఉన్నారు. నవీన్ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరితోను చేతులు కలిపింది లేదు. ఎందుకంటే ఎవరిపైనా నవీన్ కు నమ్మకం లేనట్లుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే కేసీయార్ తో చేతులు కలపటానికి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ బలమైన ప్రతిపక్షం కానీ సిద్దంగా ఉన్నట్లు అనిపించటం లేదు.

అందుకనే ప్రతిపక్షాలను కూడగట్టడంలో విఫలమవుతానన్న అనుమానంతోనే బీజేపీపై నిందలేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతానికి ఎన్డీయే చాలా బలంగా ఉంది కేంద్రంలో. కేంద్రం ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న కారణంగానే ఏదోలా నెట్టుకొచ్చేస్తుంది. తాజాగా నూతన వ్యవసాయ సంస్కరణల చట్టంపై దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాన్ని కేంద్రం లెక్క చేయటం లేదంటే ప్రతిపక్షాల బలహీనతే ప్రధాన కారణం. కాబట్టి ప్రతిపక్షాల బలహీనతనను పక్కన పెట్టేస్తే డిసెంబర్ మొదటివారంలో మోడి వ్యతిరేక పక్షాలన్నింటిని హైదరాబాద్ కు పిలుస్తానంటున్నారు కాదా చూద్దాం ఎంతమందొస్తారో ? ఎంతమంది నిలుస్తారో ?