Begin typing your search above and press return to search.

ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారా? ఈ రియల్ స్టోరీ మీకో దారి ఇస్తుంది

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:31 AM GMT
ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారా? ఈ రియల్ స్టోరీ మీకో దారి ఇస్తుంది
X
చిన్న అంశాలే కానీ పెద్ద మార్పులకు కారణంగా మారుతుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే చెందుతుంది. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ప్రయత్నిస్తే.. కోరుకున్నది సొంతం కావటం ఖాయమన్నది ఎంత నిజమన్నది ఇట్టే అర్థమవుతుంది. అమెరికాలో ఉన్నత చదువు చదివి.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వేళ.. వందల సంఖ్యలో ఎదురుదెబ్బలు తగిలి.. చివరకు సక్సెస్ అయిన ఒక కుర్రాడి రియల్ స్టోరీ.. ప్రతి ఒక్కరి జీవితాలకు ఒక పాఠంగా చెప్పాలి.

ఉద్యోగం పోయినప్పుడు.. ఉద్యోగమే రానప్పుడు.. పడే నిరాశ అంతా ఇంతా కాదు. చుట్టూ చాలానే ఖాళీలు ఉన్నా.. వారెవరికి తాము కరెక్టు వ్యక్తి కాకుండా పోవటంపై దిగులు.. ఆవేదన ఉంటుంది. కానీ.. అలాంటి వేళలో.. ఇప్పుడు చెప్పే ఉదంతాల్ని చదివితే కొత్త స్ఫూర్తి రగలటం ఖాయం. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు? అతనెందుకు స్ఫూర్తి అవుతాడు? అంటే.. అతడి రియల్ స్టోరీని మీరు చదవాల్సిందే.

ఇప్పుడు మేం చెబుతున్న కుర్రాడి పేరు వత్సల్ నహతా. ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతను.. పీజీని అమెరికాలోని యేల్ వర్సిటీలో పూర్తి చేశాడు. అలాంటి వర్సిటీలో కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం ఎగురుకుంటూ చెంతకు చేరుతుంది. కానీ.. వత్సల్ విషయంలో మాత్రం అది రివర్సు అయ్యింది. కారణం.. కొవిడ్. అతడి మాస్టర్స్ డిగ్రీ పూర్తి అయ్యింది 2020లో. కరోనా వేళ.. చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగుల ఉద్యోగాల్ని ఊడగొట్టేందుకు ప్లాన్లు వేస్తున్న వేళ.. ఉద్యోగం కోసం అతడు చేసిన ప్రయత్నాలు వరుస పెయిల్ అవుతూ వచ్చాయి.

పీజీ పూర్తి కావొస్తున్నా.. చేతిలో చేసేందుకు ఉద్యోగం లేకపోవటంతో అతగాడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. యేల్ లాంటి పేరున్న విశ్వవిద్యాలయంలో చదవిన తన లాంటి వాడికి ఉద్యోగం రాకపోవటం ఏమిటన్న ప్రశ్న అతడ్ని వెంటాడేది. ఆ వేళలో ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తే మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉండేది. ఉద్యోగం లేకుండా ఇండియాకు తిరిగి వెళ్లటం తెలివైన నిర్ణయం కాదన్న నిర్ణయానికి వచ్చిన అతను.. ఉద్యోగం కోసం జాబ్ పోర్టల్ కాకుండా సోషల్ మీడియా మీద ఫోకస్ చేశాడు. పెద్ద ఎత్తున నెట్ వర్కింగ్ మీద దృష్టి సారించాడు.

రెండునెలల వ్యవధిలో ఏకంగా 1500 ఫ్రెండ్ రిక్వెస్టులను పెట్టాడు. విసుగు చెందకుండా ప్రయత్నిస్తూనే ఉండేవాడు. దాదాపు 600 మొయిల్స్ పెట్టాడు. పలు సంస్థలకు 80కు పైగా కాల్స్ చేశాడు. అయినా.. అతడి ప్రయత్నాలు ఫలించలేదు. వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇలాంటి వేళలో.. అతను చేస్తున్న భారీ ప్రయత్నాల్లో నాలుగు సంస్థలకు అతడికి జాబ్ ఆఫర్ చేశాయి. అందులో ఒకటి ప్రపంచ బ్యాంక్ లో జాబ్. ఆ బ్యాంక్ డైరెక్టర్ తో కలిసి పని చేసే అరుదైన అవకాశం సొంతమైంది.

ప్రతికూల పరిస్థితుల్లో తాను నేర్చుకున్న పాఠాల్ని సోషల్ మీడియాలో అతను షేర్ చేశాడు. ప్రయత్నం షురూ చేసిన తర్వాత వెనకడుగు అన్నదే వద్దని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే తప్పించి వెనక్కి అడుగు వేయొద్దని అతను సలహా ఇస్తున్నాడు. అంతేకాదు.. తప్పుల నుంచి నేర్చుకోవాలని.. వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని.. అప్పుడే మంచిరోజులు ఆటోమేటిక్ గా వస్తాయని చెబుతున్నాడు. సో.. విజయ రహస్యం ఏమిటో అర్థమైందా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.