Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వం మాటః దేశీయ కంపెనీలు గాడిద‌లు

By:  Tupaki Desk   |   14 Oct 2016 9:19 AM GMT
ఏపీ ప్ర‌భుత్వం మాటః దేశీయ కంపెనీలు గాడిద‌లు
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్సాహం చూపిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతున్నాయి. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై సింగిల్‌ జడ్జి ఎం.ఎస్‌. రామచంద్రరావు గత నెల 12వ తేదీన స్టే విధించిన విషయం తెలిసిందే. స్టే రద్దు చేయాలని - ఆ పిటిషన్లను కొట్టేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి - సిఆర్‌ డిఎ కమిషనర్లు వేర్వేరుగా అప్పీల్‌ చేసిన కేసులపై దసరా సెలవుల తర్వాత వాదనలు పునః ప్రారంభమయిన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కోర్టులో గాడిద‌లు - గుర్రాల పేరుతో త‌మ వాద‌న‌ను ఏపీ స‌ర్కారు స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం.

హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ 'స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి ఒక్కటే కాదు. వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలి. మార్కెటింగ్‌ కూడా అంతే వేగంగా సాగాలి. దేశంలోని కంపెనీలు వేగంగా ప్రాజెక్టు నిర్మాణాలు చేయవచ్చు. కానీ అంతే వేగంగా మార్కెటింగ్‌ చేయగలవనే అంశంపై అనుమానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పరిగెత్తే గుర్రాలు కావాలే గానీ - గాడిదలు వద్దు..స అని అన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో విదేశాల్లో నిర్మాణాలు చేసుండాలనే నిబంధనపై ఏజీ ఈ విధంగా చెప్పగానే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌ - న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ నవ్వుతూ స్పందిస్తూ - 'నిజానికి గాడిదలే బాగా పనిచేస్తాయి. పైగా కష్టపడి పనిచేస్తాయి. గుర్రాలకంటే గాడిదలే బరువులు మోస్తాయి..'' అని వ్యాఖ్యానించింది. దీంతో ఏజీ బదులిస్తూ.. గుర్రాలే ఏపీకి కావాలని - గాడిదలు వద్దని తేల్చి చెప్పారు. మార్కెటింగ్‌ లో విదేశీ కంపెనీలు మాత్రమే పరుగులు పెడతాయని, అలా పరుగులు పెట్టే గుర్రాలే కావాలన్నారు. దేశీయ కంపెనీలు వేగంగా నిర్మాణాలు చేసినా మార్కెంటింగ్‌ చేయడంలో వెనుకబడతాయని, అందుకే తమకు గాడిదలు వద్దని అన్నారు.స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో మార్కెటింగ్‌ - ఉపాధి కల్పనే కీలకమని ఏజీ అన్నారు. విదేశాల్లో మార్కెటింగ్‌ నైపుణ్యం - అనుభవం ఉన్న కంపెనీలే విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించగలవన్నారు. ఏపీ సర్కార్‌ దగ్గర నిధులు లేకే స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని అమలు చేస్తోందని చెప్పారు. సింగపూర్‌ కన్సార్టియం సుమోటోగా ప్రతిపాదనలిస్తే వాటికి పోటీగా ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని ఏజీ చెప్పారు. పోటీ బిడ్ల దాఖలుకు నెలన్నర రోజుల గడువు సరిపోతుందని బెంచ్‌ వేసిన ప్రశ్నకు ఏజీ బదులిచ్చారు.

హైదరాబాద్‌లో అనేక ఐటీ కంపెనీల్ని దేశీయ కంపెనీలే అభివృద్ధి చేశామని ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం బెంచ్ గుర్తు చేసింది. పిటిషనర్‌ ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ తరఫు సీనియర్‌ లాయర్‌ డి. ప్రకాష్‌ రెడ్డి వాదిస్తూ టెండర్‌ నిబంధనల్లో ఆదాయమే ప్రధానమని ఉందని, అయితే కోర్టులో ప్రభుత్వం తరఫున ఏజీ ఉపాధి అవకాశాలే ముఖ్యమని అందుకు విరుద్ధంగా చెబుతున్నారని వాదించారు. మరేదైనా కంపెనీ ముందుకు వచ్చి సింగపూర్‌ కన్సార్టియం కంటే అధికంగా ఉద్యోగ - ఉపాధి అవకాశాలు కల్పిస్తామని - అయితే ఆదాయ వాటా తక్కువగా ఉందని చెబితే అందుకు ప్రభుత్వం సమ్మతిస్తుందా.. అని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ఆదాయ వాటానే కీలకమని - అందుకే సింగిల్‌ జడ్జి ఆ విషయాన్ని గమనంలోకి తీసుకుని సింగపూర్‌ కన్సార్టియం అంచనా ఆదాయ వివరాల్ని బట్టబయలు చేయాలన్నారని ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. ఆదాయ వివరాలు లేకుండా ఏ కంపెనీ అయినా బిడ్‌ దాఖలు చేస్తుందా అని అడిగారు. ఆదాయ వివరాలు ఇవ్వాలని లేఖ రాస్తే సీఆర్‌ డీఏ అధికారులు స్పందించలేదని గుర్తు చేశారు. సింగపూర్‌ కంపెనీలకు టెండర్‌ కట్టబెట్టేందుకే విదేశాల్లో నిర్మాణాలు చేసుండాలనే నిబంధన విధించారని - ప్రతిష్టాత్మక కంపెనీలు ఎన్నో నిర్మాణాలు చేసినా బిడ్‌ దాఖలు చేసే అర్హత లేకుండా టెండర్‌ నిబంధనల్ని రూపొందించారని వాదించారు. అనంత‌రం విచారణ 17వ తేదీకి వాయిదా పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/