Begin typing your search above and press return to search.

ఎవరి వాదనలేంటి?: శ్రీవారు బాకీ పడ్డారా?

By:  Tupaki Desk   |   19 Oct 2016 7:56 AM GMT
ఎవరి వాదనలేంటి?: శ్రీవారు బాకీ పడ్డారా?
X
దేవుడు ఒక రాష్ట్రానికి బాకీ పడతారా? వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికీ.. తాజాగా హైకోర్టు ముందుకు వచ్చిన ఒక పిటిషన్ పై టీటీడీకి జారీ చేసిన నోటిసుల వ్యవహారాన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి ప్రశ్నగానే చెప్పాలి. చిన్న ఆలయాలకు ప్రధాన ఆలయాలు తమ ఆదాయం నుంచి కొంత వాటా చెల్లించాలని ఎండోమెంట్ చట్టం చెబుతోందని.. ఈ లెక్కన రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు 1998 నుంచి చట్టప్రకారం ఈ నిధులు జమ చేయటం లేదన్నది చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ వాదన. ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ కింద ఏడో ప్రతివాదిగా శ్రీవారి దేవస్థానానికి ధర్మకర్తగా వ్యవహరించే టీటీడీని చేర్చారు. దీంతో ఏడుకొండల వెంకన్న తెలంగాణకు బాకీ పడిన ఆరోపణలు పడినట్లైంది. శ్రీవారికి ఇలాంటి ఇబ్బంది ఎదురుకావటానికి కారణం.. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ధనవంతుడైన దేవుడు కావటం.

మరే.. ఆలయానికి లేనంత భారీగా ఆదాయం వస్తున్న క్రమంలో.. ఆ మొత్తంలో వాటాను చిన్నఆలయాలకు అందిస్తే.. వారి ధూప దీప నైవేద్యాలతో మిగిలిన దేవాలయాలు బాగుంటాయన్నది ఈ కేసు ఉద్దేశంగా చెబుతారు. కోర్టులు.. కేసులు.. వివాదాలు.. ఆరోపణలు లాంటి సాంకేతిక అంశాల్ని కాసేపు పక్కన పెడదాం. మనలో మన మాటగా మాట్లాడుకుంటే.. మీరు కష్టపడి బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. కాలం కలిసి రావటం కానీ.. మీరు కష్టపడే తత్వం.. మీ తెలివితేటల కారణంగా బాగా సంపదను పోగేస్తున్నారనుకుందాం. మీరు సంపాదించే మొత్తంలో ఫలానా మొత్తాన్ని ఆదాయపన్ను కింద చెల్లించాలని చెబుతారు. సరేనని.. కడుతుంటారు. అయితే.. ఆదాయపన్ను మినహాయింపులు కూడా కొన్ని ఇస్తుంటారు. వాటిని ఉపయోగించుకొని మిగిలిన మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది.

ఇదే సూత్రాన్ని తాజా వివాదానికి కాసేపు అప్లై చేసి చూస్తే.. చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడి వాదన దాదాపు ఇదే తీరులో కనిపిస్తుంది. ఆయన చెప్పేదేమంటే.. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం.. పెద్ద ఆలయాలు చిన్న ఆలయాల కోసం కొంత వాటాను చెల్లించాలని. ఆ లెక్కన 1998 నుంచి సదరు చట్టం రకారం నిధులు జమ చేయలేదన్నది ఆయన వాదన. అయితే.. ఆయన చెబుతున్నది మొత్తం నాణెంలో ఒకవైపు మాత్రమే. రెండో కోణాన్ని చూడాల్సిన అవసరం ఉంది.

ఆ కోణాన్ని వివరించి చెబుతున్నారు టీటీడీకి చెందిన ముఖ్యులు. అదేమంటే.. తిరుమల శ్రీవారు ఎండోమెంట్ చట్టం పరిధిలోకి వస్తుంది కానీ.. ఆ చట్టంలో టీటీడీకి సంబంధించి ప్రత్యేక అధ్యాయాలు ఉన్నాయి. ఈ రూల్స్ మిగిలిన ఆలయాలకు అమలు అవుతాయే కానీ టీటీడీకి అమలు కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలా ఎలా అంటే.. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రత్యేక చట్టాన్ని చేశారు. దీని ప్రకారం.. టీటీడీకి సంబంధించిన ఆదాయ.. వ్యయాల విషయంలో రాష్ట్ర సర్కారు సంరక్షకుడి పాత్రను మాత్రమే పోషించాలే తప్పించి.. ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే వీల్లేదు.

టీటీడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలనే హక్కు కూడా ఉండదు. టీటీడీ నుంచి అప్పు తీసుకోవటం కూడా సాధ్యంకాదు. ఎందుకంటే.. టీటీడీకి వచ్చే నిధులు ప్రపంచ వ్యాప్తంగా స్వామి వారి మీద ఉన్న భక్తి.. విశ్వాసాల కారణంగా వచ్చే మొత్తం కాబట్టి.. వాటిపై ఎవరికి ఎలాంటి అజమాయిషీ ఉండదు. భక్తుల ఆస్తిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించటం సరికాదన్న వాదనను గతంలో కోర్టులు సైతం సమర్థించాయి. తన మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి దేవాలయాలు కొంత మొత్తాన్ని మాత్రం విధిగా చెల్లించాలి. అలాంటి చెల్లింపుల్లో 7 శాతం ఎండోమెంట్ ఆడ్మినిస్ట్రేషన్ ఫండ్ కు.. కామన్ గుడ్ ఫండ్ కోసం 5 శాతం.. అర్చక సంక్షేమ నిధికి 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. వీటి నుంచి కూడా టీటీడీకి మినహాయింపు ఉంది. మరి.. ఇలాంటివి ఉన్నప్పుడు.. శ్రీవారు తమకు అప్పు పడ్డారన్న వాదనలో పస లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల లోతుపై అవగాహన లేకనే ఇలాంటి ఫిర్యాదులు చేస్తారని.. తమ వాదనను కోర్టులు విన్నాక.. వాస్తవం మరింత స్పష్టమవుతుందన్న అభిప్రాయం టీటీడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే.. తెలంగాణ రాష్ట్రానికి ఏడుకొండల వెంకన్న బాకీ ముచ్చట మీద ఉన్న రెండు వాదనలు. మరి.. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరెన్ని కొత్త ముచ్చట్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/