Begin typing your search above and press return to search.

పాక్ లెక్క తేల్చాలనేలా ఆ దేశాధ్యక్షుడు..ప్రధాని మాటల తూటాలెందుకు?

By:  Tupaki Desk   |   15 Aug 2019 5:10 AM GMT
పాక్ లెక్క తేల్చాలనేలా ఆ దేశాధ్యక్షుడు..ప్రధాని మాటల తూటాలెందుకు?
X
సగటు భారతీయడి రక్తం మరిగిపోయేలా దారుణ వ్యాఖ్యలు చేశారు పాక్ దేశాధ్యక్షుడు ఆరిఫ్-ఉర్‌-రెహ్మాన్‌ ఆల్వి - ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లు ఇద్దరూ. తాజాగా వేర్వేరు వేదికల మీద వారు చేసిన వ్యాఖ్యలు విన్నంతనే పాక్ సంగతి చూడాలన్న భావన కలిగేలా చేయటం ఖాయం. తీవ్రవాదం మీద పోరాడుతున్నట్లుగా గొప్పలు చెప్పటమే కాదు.. తమను తాము శాంతికాముకులుగా చెప్పుకునే వారి తీరు చూస్తే.. ఒళ్లు మండటం ఖాయం. ఇప్పటివరకూ దేశం ఎదుర్కొన్న అన్ని ఉగ్ర ఘటనలకు మూలం దాయాదేనన్న విషయం తెలిసిందే.

జమ్ము కశ్మీర్ సమస్యను తేల్చేందుకు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తీరుతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పాకిస్థాన్.. తాజాగా తన నీచ స్వభావాన్ని మరోసారి ప్రదర్శించే ప్రయత్నం చేసింది. కశ్మీరీల కోసం తమ ప్రాణాల్ని ఇచ్చేందుకైనా సిద్దమేనని చెబుతూ.. మరోవైపు భారత్ తో యుద్ధానికి వస్తే తాము సిద్ధమని చెప్పేయటం గమనార్హం. యుద్ధమే కానీ వస్తే.. దానికి ప్రపంచం మొత్తం ప్రభావితం అవుతుందన్న బెదిరింపు చేయటం చూస్తే.. తాజాగా చేసిన వ్యాఖ్యలన్ని వ్యూహాత్మకమేనన్న విషయం అర్థం కాక మానదు. ఎందుకన్న విషయంపై మాట్లాడుకునే ముందు.. దేశాధ్యక్షుడు.. ప్రధానమంత్రులు చేసిన దారుణ వ్యాఖ్యల్ని చూడాల్సిన అవసరం ఉంది.

‘‘మేం శాంతికాముకులం. ఇపుడు భారత్‌ మాపై యుద్ధాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోంది. దీని ప్రభావం యావత్ప్రపంచంపై పడుతుంది. యుద్ధ సన్నాహాల్లో ఉన్న భారత్‌ పై జిహాద్‌ తప్ప మాకు వేరు మార్గంలేదు’’

‘కశ్మీర్‌ మాదే. ఎప్పటికీ మాదే. కశ్మీరీల బాధ మా బాధ. వారిని ఒంటరిగా వదిలేయం. వారి ప్రతీ అడుగులో వెన్నంటి ఉంటాం’

‘‘సోషల్‌ మీడియాలో కశ్మీర్‌ గురించి సాధ్యమైనన్ని ఎక్కువగా పోస్టులు పెట్టండి. వీడియోలు పెట్టండి. భారత-వ్యతిరేకతను ఉధృతంగా ఉద్యమంలా ప్రచారం చేయండి. భావోద్వేగాలను రెచ్చగొట్టండి’’

‘‘కశ్మీర్‌ స్వేచ్ఛ కోసం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్‌ను రెండు ముక్కలు చేశారు. ఆర్టికల్‌ 370కింద ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించారు. వీటికి తోడు- పీవోకేపైనా దాడులకు భారత సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై మా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. పుల్వామా ఘటన అనంతరం బాలాకోట్‌పై దాడిచేసిన తరహాలోనే మళ్లీ దాడులకు కుట్ర చేస్తోంది. ఒకవేళ భారత్‌ గనక అలాంటి చర్యకు దిగితే దీటుగా తిప్పికొడతాం’’

‘‘భారత్‌ నేతలు గుర్తుంచుకోవాలి.. నే చెబుతున్నా. మీరు ఇటుకతో కొడితే మేం రాయి వేసి కొడతాం. మీరు విసిరే ప్రతీ ఇటుకకూ గట్టిగా సమాధానమిస్తాం..’’

‘‘యుద్ధం అనివార్యమైతే అందుకు పాక్‌ రెడీ.. కశ్మీరీల కోసం ప్రాణాలొడ్డుతాం. 20ఏళ్లుగా ఉగ్రవాదంపై యుద్ధంతో రాటుదేలిపోయాం. మా దేశం.. మా ప్రజలు ఇపుడు అంతా ఒకే పక్షం. ఇక ఎలాంటి ఉల్లంఘనలూ సహించం. యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నాం’’

‘‘యుద్ధం వస్తే దానికి ప్రపంచానిదే బాధ్యత. భారత్‌ దుశ్చర్యల్ని మేం ఎప్పటికప్పుడు ప్రపంచదేశాల దృష్టికి తెస్తూనే ఉన్నాం. భద్రతామండలి అత్యవసరంగా సమావేశమై ఈ చర్యలపై చర్చ జరపాలి. భారత్‌ ను కట్టడి చేయాలి’’

‘ప్రస్తుతం మౌనంగా ఉన్నా కశ్మీరీ పరిణామాలపై అనేక దేశాలు- ముఖ్యంగా ఇస్లామిక్‌ దేశాలు ఆందోళనతో ఉన్నాయి. మేం సెప్టెంబరులో భద్రతామండలిలో దీన్ని లేవనెత్తినపుడు ఎన్ని దేశాలు మద్దతిస్తాయో మీరే చూడొచ్చు’’

ఆర్టికల్ 370 నిర్వీర్యం.. 35ఏ అన్నది సోదిలో లేకుండా పోయిన నేపథ్యంలో పాక్ అక్రమిత కశ్మీర్ లో నిరసనలు పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత పార్లమెంటుతో పాటు.. మిగిలిన వేదికల మీదా దేశ ప్రధాని.. కేంద్ర హోం మంత్రులతో పాటు కీలకమైన బీజేపీ నేతలంతా పాక్ అక్రమిత కశ్మీర్ గురించి వ్యాఖ్యలు చేయటం.. ఆ ప్రాంతం తమ సొంతమన్న మాటను మొహమాటం లేకుండా చెప్పేయటమే కాదు.. దాన్ని సొంతం చేసుకునేందుకు తమ ప్రాణాల్ని ఇచ్చేందుకైనా సిద్ధమని చెప్పటం తెలిసిందే.

భారత పాలకుల నుంచి ఈ తరహా వ్యాఖ్యల్ని పాక్ ఇప్పుడే వినటం. గతంలోని ప్రభుత్వాలన్ని కశ్మీర్ అంశంపై ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించేవి. ఇక.. పాక్ అక్రమిత కశ్మీర్ గురించి మాట వరసకు మాట్లాడటానికైనా తెగ ఇబ్బందికి గురయ్యేవి. ఇందుకు భిన్నంగా మోడీ సర్కారు పీవోకే గురించి తమ స్టాండ్ ను స్పష్టంగా చెప్పేయటం పాక్ కు వెన్నులో చలి పుట్టిస్తోంది. ఇప్పుడున్న భారత్.. గతంలో మాదిరి కాదని.. దాని దూకుడు తట్టుకోవాలంటే రివర్స్ గేర్ తప్పదన్న వ్యూహంతో తాజా వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.

పాక్ లోని ఇమ్రాన్ ప్రభుత్వం తాజాగా తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోంది. తీవ్రమైన ద్రవ్యోల్బణంతో నిత్యవసర వస్తువులు భారీగా పెరిగిపోవటమే కాదు.. చివరకు రొట్టెలకు సైతం రేషన్ విధించాల్సిన దుస్థితి. దీంతో.. ఇమ్రాన్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. భారత్ దూకుడుకు కళ్లెం వేయటంలోనూ ఇమ్రాన్ సర్కారు ఫెయిల్ అయ్యిందన్న మాట ఇప్పుడు పెరుగుతోంది. ఈ కష్టాలు చాలవన్నట్లుగా అమెరికా నుంచి ఆశించినంత స్థాయిలో ఆర్థిక చేయూత లేకపోవటంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

పాకిస్థాన్ ఇప్పుడున్న పరిస్థితిలో తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అంతేకాక.. అంతర్జాతీయ సమాజం కూడా పాక్ కు దన్నుగా నిలవటం లేదు. చైనా సైతం ఊహించినంత ఎక్కువగా మద్దతు పలకటం లేదు. దీంతో.. సంచలన ప్రకటనలు చేయటం.. యుద్ధ నినాదం చేయటం ద్వారా అంతర్జాతీయ సమాజం కంట్లో పడాలని.. కశ్మీర్ ఇష్యూలో తల దూర్చేలా చేయటమే వ్యూహంగా చెప్పాలి. యుద్ధం కానీ వస్తే.. అది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందన్న మాటతో మోడీ సర్కారు దూకుడుకు బ్రేకులు వేయటమే అసలు లక్ష్యమని చెప్పక తప్పదు. ఈ కారణంతోనే గతానికి భిన్నంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.