Begin typing your search above and press return to search.

ఆర్మీ నిరుద్యోగులను మరింత రెచ్చగొడుతున్న మాజీ ఆర్మీ చీఫ్

By:  Tupaki Desk   |   20 Jun 2022 8:30 AM GMT
ఆర్మీ నిరుద్యోగులను మరింత రెచ్చగొడుతున్న మాజీ ఆర్మీ చీఫ్
X
రగులుతున్న కాష్టంపై పెట్రోల్ పోయడమంటే ఇదే.. ఇప్పటికే 'అగ్నిపథ్' అల్లర్లతో కేంద్రం తలపట్టుకుంటంటే.. మరోవైపు మాజీ ఆర్మీ చీఫ్ చేసిన ఈ ప్రకటన మరింతగా అగ్నికి ఆజ్యం పోస్తోంది. అగ్నిపథ్ పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ తీరు చర్చనీయాంశమైంది.

ఇప్పటికే ఈ స్కీమ్ పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై వీకే సింగ్ మండిపడ్డారు. వీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్ నచ్చకపోతే అభ్యర్థులు దానిని ఎంచుకోవద్దని ఘాటుగా స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని కోరారు. భారత సైన్యం సైనికులుగా చేరమని ఎవరినీ బలవంతం చేయదని.. సైన్యంలో చేరాలనుకునే వారు తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ నచ్చకపోతే అందులో చేరండి అని మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారని వీకేసింగ్ ప్రశ్నించారు. అంతేకాకుండా బస్సులు, రైళ్లను తగలబెడుతున్న వారిని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేసేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు అగ్నిపథ్ గురించి ప్రస్తావన వచ్చిందని ఆయన వెల్లడించారు. అగ్నిపథ్ నియామక విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ త్రివిధ దళాల ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ పై త్రివిధ దళాలు కీలక ప్రకటన చేశాయి. త్రివిధ దళాల్లో ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవని.. కేవలం అగ్నిపథ్ పథకం ద్వారా నియామకాలు జరుగుతాయని రక్షణ శాఖ అడిషనల్ సెక్రటరీ, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టం చేశారు. గతంలో రెండు పరీక్షలు పూర్తి చేసుకున్న వారు కూడా అగ్నిపథ్ పథకంలో చేరాల్సిందేనని తేల్చిచెప్పారు. అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.

త్రివిధ దళాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్కరణ ద్వారా యువత, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఆర్మీని సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సైన్యం సగటు వయసు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. కార్గిల్ రివ్యూ కమిటీ సైతం దీని గురించి ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఈ సంస్కరణ చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉందని రక్షణ శాఖ అడిషనల్ సెక్రటరీ తెలిపారు.అగ్నివీరులకు వివిధ మంత్రిత్వశాఖల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు వచ్చిన ప్రకటనలు.. నిరసనలు వల్ల కాదని పూరి స్పష్టం చేశారు. ఇదంతా ముందస్తు ప్రణాళికల్లో భాగమేనని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అగ్నిపథ్ విధానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

పథకం పనితీరును అంచనావేయడం సహా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తొలుత 46వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో రిక్రూట్ మెంట్ సంఖ్య 60వేల వరకూ ఉంటుందన్నారు. దీన్ని క్రమంగా 90వేల నుంచి లక్ష వరకూ పెంచుతామన్నారు. సమీప భవిష్యత్తులోనే ఇది 1.25 లక్షల వరకూ పెరిగే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం 46వేల మందిని తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్ నియామకాలు ఇదే స్థాయిలో మాత్రం ఉండవన్నారు. దేశ సేవలో అమరులైతే అగ్నివీరుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందుతుందన్నారు. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారనే వాదన సరికాదని తెలిపారు.