Begin typing your search above and press return to search.

ఆ ఆర్మీ జ‌వాను.. ఓ రేపిస్ట్‌..!

By:  Tupaki Desk   |   26 July 2018 4:52 AM GMT
ఆ ఆర్మీ జ‌వాను.. ఓ రేపిస్ట్‌..!
X
షాకింగ్ ఉదంతం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. హైద‌రాబాద్ లో రెండు.. మూడు రోజుల క్రితం ఒక ఆర్మీ జ‌వాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమ‌ల గిరి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో కాపుకాచి.. ప్రేమ జంట‌ల‌పై దాడి చేసి.. వారిపై అత్యాచారాలు చేసే ఒక దుర్మార్గుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ కు చెందిన బ్రిజేశ్ కుమార్ యాద‌వ్ గా అత‌డ్ని గుర్తించారు. ప్ర‌స్తుతం ఆర్మీలో సిపాయిగా ప‌ని చేస్తున్న అత‌గాడు.. ఒక ప్రేమ జంట‌పై దాడి చేశారు.

అనంత‌రం మ‌హిళ మీద అత్యాచార య‌త్నం చేశాడు. ఆ స‌మ‌యంలో అటువైపుగా వెళుతున్న పోలీసులు.. యువ‌తి అరుపులు విని.. ఆమెను ర‌క్షించి.. అతి క‌ష్ట‌మ్మీదా సిపాయిని అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ షురూ చేసిన త‌ర్వాత దిమ్మ తిరిగిపోయే వాస్త‌వం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా సికింద్రాబాద్ లోని 54 ఇన్ ఫాంట్రీ డివిజ‌న్ సిగ్న‌ల్ రెజిమెంట్ లో జ‌వానుగా ప‌ని చేసే బ్రిజేశ్ లో మ‌రో మ‌నిషి ఉన్నాడు. బిహార్ లోని రాణిపూర్ కు చెందిన ఇత‌గాడు.. ఒంట‌రి మ‌హిళ‌ల‌పై క‌న్నేశాడు. భార్య‌.. కుమార్తెతో క‌లిసి నేరేడ్ మెట్ లో ఉండే ఇత‌ను నిత్యం తిరుమ‌ల‌గిరి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని అమ్ముగూడ రైల్వే ట్రాక్ స‌మీపంలో ఉండి.. ప్రేమ‌జంట‌ల్ని టార్గెట్ చేస్తూ.. యువ‌కుల‌పై దాడికి పాల్ప‌డి.. యువ‌తుల్ని భ‌య‌పెట్టి అత్యాచారానికి ఒడిగ‌ట్టేవాడు.

ఇదే త‌ర‌హాలో గ‌త డిసెంబ‌రులో ఒక జంట‌పై దాడి చేశాడు. యువ‌కుడ్ని త‌రిమేసి.. బాలిక‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం బాలిక స‌మాచారాన్ని అటువైపు వెళుతున్న వారు ఇవ్వ‌టంతో ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. లైంగిక దాడికి పాల్ప‌డిన బాలిక ఆర్మీకి చెందిన ఒక అధికారి కుమార్తెగా గుర్తించారు. అయితే.. దీనికి సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. పోలీసు వ‌ర్గాలు సైతం ఈ విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే.. ప‌లువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించినా లాభం లేక‌పోయింది. అనూహ్యంగా తాజాగా ప‌ట్టుబ‌డిన సిపాయి.. తానుచేసిన అకృత్యాల్ని పోలీసు విచార‌ణ‌లో వెల్ల‌డించాడు. దీంతో.. అత‌డ్ని రిమాండ్‌కు త‌ర‌లించాడు. ప‌క్కా ఆధారాల‌తో అత‌డు చేసిన నేరాన్ని రుజువు చేయ‌టంతో పాటు.. ఇత‌గాడి దుర్మార్గాల్ని ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు.