Begin typing your search above and press return to search.

హేట్సాఫ్.. ఆమెను 6కి.మీ. మోసిన జవాన్లు

By:  Tupaki Desk   |   22 Jan 2020 3:53 AM GMT
హేట్సాఫ్.. ఆమెను 6కి.మీ. మోసిన జవాన్లు
X
ప్రతికూల వాతావరణంలోనే కాదు.. ప్రతికూల పరిస్థితుల్లో పని చేసే జవాన్ల దేశభక్తి.. త్యాగనిరతి.. సేవాభావం గురించి తెలియని వారుండరు. తాజాగా.. వారి పనితీరు మరోసారి అందరి మనసుల్ని టచ్ చేయటమే కాదు.. వారి మీద మరింత గౌరవ మర్యాదల్ని పెంచే ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. నిండు గర్భణికి వైద్య సాయం అందేందుకు వీలుగా ఆర్మీ జవాన్లు చేసిన పని అందరి నోటా ప్రశంసలు పొందేలా చేస్తోంది.


ఛత్తీస్ గఢ్ లోని మారుమూల పల్లె పడెడ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 85వ బెటాలియన్ కు చెందిన జవాన్లు పెట్రోలింగ్ లో భాగంగా గ్రామానికి వెళ్లారు. అక్కడ నెలలు నిండిన గర్భిణి తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్న వైనాన్ని చూశారు. వెంటనే.. ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెను ఆరు కిలో మీటర్ల దూరంలోని ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లాల్సి ఉందని గ్రామస్తులు చెప్పటం తో జవాన్లు నడుం బిగించారు.


మంచం మీద నొప్పులతో అవస్థలు పడుతున్న ఆమెను.. అలానే నాలుగు వైపులా నలుగురు జవాన్లు మోస్తూ.. వంతుల వారీగా మోసుకుంటూ ఆరు కి.మీ. నడుచుకుంటూ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె బిజాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లో ఉన్నారు. సకాలంలో స్పందించిన ఆర్మీ జవాన్ల పై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.