Begin typing your search above and press return to search.

సచిన్ దేశభక్తినే శంకిస్తాడా?

By:  Tupaki Desk   |   24 Feb 2019 4:06 PM GMT
సచిన్ దేశభక్తినే శంకిస్తాడా?
X
తన అసమాన క్రికెట్ విన్యాసాలతో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు భారత క్రికెట్ అభిమానుల్ని అలరించి క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఆటగాడిగానే కాక వ్యక్తిగానూ అతడి నిబద్ధతను ఎవ్వరూ ప్రశ్నించజాలరు. అతడి దేశభక్తిని కూడా ఎవ్వరూ శంకించలేరు. కానీ టీవీ ప్రెజెంటర్ అర్నాబ్ గోస్వామి మాత్రం సచిన్ దేశభక్తిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు. అతడిని ఒక దేశ ద్రోహిగా అభివర్ణిస్తున్నాడు. ఇంతకీ సచిన్ చేసిన తప్పేమిటో తెలుసా? రాబోయే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడాలని అభిప్రాయం వ్యక్తం చేయడం.

పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ తో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని ప్రపంచకప్‌ లోనూ ఆ జట్టుతో మ్యాచ్ ఆడొద్దని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐతే సచిన్ ఈ అభిప్రాయంతో విభేదించాడు. మ్యాచ్ ఆడకుండా వారికి ఊరికే 2 పాయింట్లు ఇవ్వడం ఎందుకని.. దాని బదులు మ్యాచ్‌ లో పాకిస్థాన్‌ ను చిత్తుగా ఓడిద్దామని అన్నాడు. ఇది పెద్ద తప్పిదం అంటున్నాడు అర్నాబ్. ఇలా మాట్లాడినందుకు సచిన్ దేశభక్తిని అతను శంకిస్తూ.. అవాకులు చెవాకులు పేలాడు అర్నాబ్. సచిన్ అభిప్రాయం నూటికి నూరుపాళ్లు తప్పని.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దని దేశంలో చెప్పాల్సిన తొలి వ్యక్తి సచినే అని.. అలాంటిది మ్యాచ్ ఆడాలని ఎలా అంటాడని ప్రశ్నించాడు అర్నాబ్. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన మరో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ను కూడా అతను తప్పుబట్టాడు. ఐతే అర్నాబ్ వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెయిడ్ మీడియా పర్సన్ అయిన అర్నాబ్.. సచిన్ దేశభక్తిని శంకిస్తాడా అంటూ అతడిని తిట్టిపోస్తున్నారు.