Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డు ఛైర్మన్ తో బంతాట

By:  Tupaki Desk   |   25 Nov 2015 11:09 AM GMT
సెన్సార్ బోర్డు ఛైర్మన్ తో బంతాట
X
పహ్లాజ్ నిహలాని.. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది ఈ పేరు. ఇంతకీ ఎవరయ్యా ఈయన అంటే.. నేషనల్ సెన్సార్ బోర్డు ఛైర్మన్. జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో లిప్ లాక్ సీన్ లెంగ్త్ ఎక్కువైందని.. దానికి కోత వేయించి తీవ్ర విమర్శలెదుర్కొన్నది ఈయనే. పహ్లాజ్ సీబీఎఫ్సీ ఛైర్మన్ అయినప్పటి నుంచి సినిమాల సెన్సార్ విషయంలో టూమచ్‌గా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు చాలా ఉన్నాయి. ఐతే ఈయన సినిమా బ్యాగ్రౌండ్ లేనివాడేమో అనుకుంటే పొరబాటే. బాలీవుడ్ లో నిర్మాతగా చాలా సినిమాలే తీశాడు పహ్లాజ్. అందులో కొన్ని బి-గ్రేడ్ సినిమాలు కూడా ఉండటం విశేషం. మోడీ మీద కీర్తిస్తూ ఓ స్పెషల్ డాక్యుమెంటరీ తీయడం ద్వారా సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవి కొట్టేశాడని ఈయన మీద ఆరోపణలున్నాయి. స్వయంగా సినిమాలు తీసిన నిర్మాత సెన్సార్ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది.

ఇలాంటి సమయంలో తన షోకు వచ్చే గెస్టుల్ని ఆటాడుకునే అర్నాబ్ గోస్వామి షోకు వెళ్లి పహ్లాజ్ భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన షోలో అర్నాబ్ పహ్లాజ్ ను ఫుట్ బాల్ ఆడేసుకున్నాడనే చెప్పాలి. తాను అసలు ‘స్పెక్టర్’ సినిమా పూర్తిగా చూడలేదని.. నిబంధనల ప్రకారమే లిప్ లాక్ సీన్ లెంగ్త్ తగ్గించమని చెప్పానని అనడంతో అర్నాబ్ రెచ్చిపోయాడు. ఇండియాలో ఇంతకుముందు రిలీజైన కామసూత్ర ఇతర సినిమాల్లో ఇంతకంటే ఎక్కువ రొమాన్స్ ఉంది కదా అని అడగ్గా.. వాటిని తాను చూడలేదన్నాడు. ఇక అర్నాబ్ ఊరుకుంటాడా? పహ్లాజ్ ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశాడు. అతడి ప్రశ్నలకు పహ్లాజ్ దగ్గర సమాధానమే లేకపోయింది. మీరు డోర్ తెరుచుకుని సెక్స్ చేస్తారా.. అలాగే సినిమాల్లో ఎంతవరకు చూపించాలో చూసి తాము నిర్ణయిస్తాం అంటూ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసినా పహ్లాజ్ పప్పులుడకలేదు. పహ్లాజ్ ను అర్నాబ్ ఆడుకున్న తీరు చూసి రాంగోపాల్ వర్మ భలే ఖుషీ అయిపోయాడు. అర్నాబ్ పాదాన్ని ఫొటో తీసి పంపితే.. సినిమా ఇండస్ట్రీ వాళ్లందరూ దండం పెట్టుకుని.. అప్పుడైనా ధైర్యంగా సెన్సార్ బోర్డును ఎదుర్కొంటారని వర్మ చెప్పడం విశేషం.