Begin typing your search above and press return to search.

మోడీ మాట‌ను విన‌నంటున్న ఆ మంత్రి

By:  Tupaki Desk   |   29 May 2017 9:12 AM GMT
మోడీ మాట‌ను విన‌నంటున్న ఆ మంత్రి
X
అందరి దారి ఒక‌టైతే.. త‌న దారి మాత్రం భిన్న‌మంటూ మొండికిపోతున్నాడు ప‌శ్చిమ‌బెంగాల్‌ కు చెందిన ఒక మంత్రి. వీఐపీ క‌ల్చ‌ర్‌ కు బ్రేకేస్తూ..ఎర్ర‌బుగ్గ‌ను నిషేధిస్తూ కేంద్రం చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ ఎర్ర‌బుగ్గ‌ను వినియోగించిన ప్ర‌ముఖులంతా వాటిని తీసేయాల‌ని.. అంబులెన్స్‌.. అగ్నిమాప‌క వాహ‌నాలు.. పోలీసుల వాహ‌నాల‌కు మిన‌హా ఇంకెవ్వ‌రూ ఎర్ర‌బుగ్గ‌ల్ని వాడొద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. కేంద్ర‌ప్ర‌భుత్వం నిషేధించిన ఎర్ర‌బుగ్గ‌ల్ని వినియోగిస్తూ అడ్డ‌దిడ్డంగా వాదిస్తున్నారు ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర మంత్రి ఒక‌రు.

పీడ‌బ్ల్యూడీ శాఖామంత్రి అరూప్ విశ్వాస్‌.. నేటికీ త‌న వాహ‌నంపైన ఎర్ర‌బుగ్గ‌ను వాడుతున్నారు. తాజాగా మీడియా కంట ప‌డిన ఆయ‌న్ను.. ఎర్ర‌బుగ్గ ఎందుకు వాడుతున్నార‌న్న ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ ప్ర‌భుత్వం ఎర్ర‌బుగ్గ‌ల్ని నిషేధించ‌లేద‌ని.. అలాంట‌ప్పుడు తాను ఎవ‌రి ఆదేశాలో పాటించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వేరే వారి నిర్ణ‌యాన్ని మేం పాటించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని రివ‌ర్స్ గేరులో మాట్లాడిన మాట‌లు ఇప్పుడు వివాదంగా మారాయి. ప‌శ్చిమ‌బెంగాల్ మంత్రి ఒక్క‌రు మాత్ర‌మే కాదు.. ప‌లువురు ప్ర‌ముఖులు ఇంకా ఎర్ర‌బుగ్గ‌ల్ని వాడుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఎర్ర‌బుగ్గ‌ల్ని నిషేధిస్తూ మే 1 నుంచి నిషేదిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసినా.. ఇలా తొండి వాద‌న‌ను వినిపిస్తున్న మంత్రి మీద విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశంలో ప‌శ్చిమ‌బెంగాల్ ఒక రాష్ట్రమే త‌ప్పించి.. ప్ర‌త్యేకం కాద‌న్న విష‌యాన్ని బెంగాలీ ప్ర‌ముఖులు ఎందుకు మిస్ అవుతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/