Begin typing your search above and press return to search.

గుంటూరు జిన్నాటవర్ ను టచ్ చేయలేని రీతిలో ఏర్పాట్లు

By:  Tupaki Desk   |   18 Jan 2022 4:04 AM GMT
గుంటూరు జిన్నాటవర్ ను టచ్ చేయలేని రీతిలో ఏర్పాట్లు
X
దశాబ్దాల క్రితం నాటి కట్టటం జిన్నా టవర్. గుంటూరు నగరం నడి బొడ్డున ఉండే ఈ జిన్నా టవర్ ఒక్కసారిగా వివాదంగా మారటం.. ఈ కట్టడాన్నికూల్చి వేస్తామని బీజేపీ నేతల నోటి నుంచి వచ్చిన వేళ.. ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాకిస్థాన్ జాతిపిత అయిన మహ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఈ టవర్ పేరును మార్చాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై ఏపీ అధికారపక్ష వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు కావాలనే ఇలాంటి అంశాన్ని లేవనెత్తినట్లుగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వైసీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. దీంతో ఈ ఉదంతం కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. ఇదిలా ఉంటే.. తమ డిమాండ్ కు తగ్గట్లు జగన్ ప్రభుత్వం జిన్నాటవర్ పేరును మార్చకపోతే.. దీన్ని తొలగిస్తామని చెప్పి మరింత సంచలనానికి తెర తీశారు ఏపీ బీజేపీ నేతలు.

దీంతో.. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా రివ్యూ చేసింది. బీజేపీ నేతల మాటలకు తగ్గట్లు.. అనవసరమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం మొదలైంది. ఈ నేపథ్యంలో జిన్నా టవర్ కు ఏం కాకుండా ఉండేందుకు వీలుగా ఎత్తున ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు సోమవారం మొదలయ్యాయి.

తాజాగా గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు జిన్నా టవర్ వద్దకువచ్చి.. దాన్ని కాపాడుతామని.. అందుకు అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లే జిన్నా టవర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. ఎవరూ కూడా జిన్నా టవర్ ను టచ్ చేయాలన్న ఆలోచనకు రాలేని విధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

అంతేకాదు.. అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. తాము అధికారంలోకి వచ్చినంతనే.. జిన్నా టవర్ పేరును మారుస్తామని చెబుతూ.. ఈ ఇష్యూను మరింత క్లిష్టంగా..కష్టంగా మారుస్తున్నారని చెప్పక తప్పదు.