Begin typing your search above and press return to search.

సీఎం మేనల్లుడి అరెస్ట్

By:  Tupaki Desk   |   4 Feb 2022 7:30 AM GMT
సీఎం మేనల్లుడి అరెస్ట్
X
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పంజాబ్ లో సంచలనం చోటు చేసుకుంది. పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. హనీపై మనీ ల్యాండరింగ్ ఆరోపణలున్నాయి. దాంతో ఈ మధ్యనే ఈడీ అధికారులు హనీ ఆఫీసుపై, ఇంటి పైన దాడులు జరిపారు. విచారణ పేరుతో దాదాపు 8 గంటల అదుపులోనే ఉంచుకున్నారు చాలాసార్లు.

కొద్ది రోజుల పాటు విచారణ పేరుతో అదుపులో ఉంచుకుని ఈరోజు ఉదయం హఠాత్తుగా అరెస్టు చేసినట్లు ప్రకటించారు. దాంతో పంజాబ్ లో రాజకీయంగా ఒక్కసారిగా సంచలనం మొదలైంది. ప్రత్యర్థులపై బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్ధలను ప్రయోగిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ, ఐటీ శాఖల ఉన్నతాధికారులు ప్రత్యర్థి పార్టీల నేతలపైన దాడులు చేస్తుండటమే ఆరోపణలకు ఊతమిస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్, పశ్చిమబెంగాల్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ+ఆయన భార్యపైన కూడా కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు పంజాబ్ లో సీఎం మేనల్లుడు హనీ అరెస్టుతో దర్యాప్తు సంస్థల చిత్తశుద్ధి పైన ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

సరిగ్గా ఎన్నికల సమయంలోనే దర్యాప్తు సంస్థలు ఇలాంటి దాడులు, అరెస్టులు చేస్తుండటంపై ప్రతిపక్షాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజంగానే ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే ఇంతకాలం ఏమి చేస్తున్నారంటూ చన్నీ నిలదీశారు.

ప్రతిపక్షాల నేతలు, వారి మద్దతుదారులు చేస్తున్న చట్ట వ్యతిరేకత కార్యకలాపాలు కేంద్ర దర్యాప్తు సంస్ధలకు సరిగ్గా ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. తన మేనల్లుడు హనీ విషయంలో ఈడీ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. అధికారంలోకి రాలేమన్న మంటతోనే బీజేపీ అధికార కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టాలనే ఈడీని ఉపయోగంచుకుంటోందంటు రెచ్చిపోయారు. మరి ఎన్నికలు అయ్యేసరికి ఇంకెన్ని అరెస్టులుంటాయో చూడాల్సిందే.