Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిల అరెస్ట్.. చూసేందుకు వెళ్లిన తల్లి విజయమ్మ హౌస్ అరెస్ట్.. రంగంలోకి బ్రదర్ అనిల్

By:  Tupaki Desk   |   29 Nov 2022 12:41 PM GMT
వైఎస్ షర్మిల అరెస్ట్.. చూసేందుకు వెళ్లిన తల్లి విజయమ్మ హౌస్ అరెస్ట్.. రంగంలోకి బ్రదర్ అనిల్
X
ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ప్రజల్లో పరపతి తెచ్చుకోని వైఎస్ షర్మిల వివాదాలతో అది సంపాదించుకునే పనిలో పడ్డారు. ఏదో ఒక ఇష్యూపై రోడ్డుపై గలాటా చేస్తూ అరెస్ట్ అవుతూ కావాల్సినంత మైలేజ్ సంపాదించేందుకు రెడీ అయ్యారు. ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు స్వయంగా కారు నడుపుతూ వచ్చిన షర్మిలను ఆ కారుతోపాటే ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఇక కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిల పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్ నివాసం ప్రగతి భవన్ కు వెళుతుండగా అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అరెస్ట్ చేసిన పోలీసులు పంజాగుట్ట పీఎస్ నుంచి ఎస్ఆర్ నగర్ కు తరలించారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు పెట్టారు. కారులో ఉండగానే దానికి టోయింగ్ కట్టి లాక్కెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట పిట్ట రామిరెడ్డి, ఇతర నాయకులు కారులో ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీద బైఠాయించారు.

ఇక తన కూతురును అరెస్ట్ చేయడానికి నిరసనగా ఆమె తల్లి వైఎస్ విజయమ్మ రంగంలోకి దిగారు. కుమార్తెను పరామర్శించడానికి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడ్డారు. కారులో బయలు దేరిన విజయమ్మను పోలీసులు ఇంటివద్దే అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్లడానికి వీళ్లేదని.. ఇంట్లోకి వెళ్లాలని సూచించారు. కానీ కారు దిగిన విజయమ్మ ఇంటివద్ద భైటాయించడానికి ప్రయత్నించగా పోలీసులు భగ్నం చేశారు. కూతురిని చూడడానికి వెళ్లనివ్వరా అంటూ పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. దీక్షకు కూర్చుంటానని.. ధర్మా చేస్తానని హెచ్చరించారు.

పోలీసులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా వెళ్లనివ్వకపోవడంతో వైఎస్ విజయమ్మ నిరసన వ్యక్తం చేశారు. ఇంటి వద్దే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పారు. పార్టీ కార్యకర్తలందరినీ పిలవమంటారా? మైక్ తీసుకొని మాట్లాడమంటారా? అంటూ మండిపడ్డారు.

ఇలా కూతురు షర్మిల కోసం రోడ్డెక్కిన తల్లి విజయమ్మను కూడా హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు. ఇక భార్య, అత్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బ్రదర్ అనిల్ రంగంలోకి దిగారు. తన భార్య షర్మిలను కలుసుకునేందుకు బయలు దేరారు.

తన భార్య వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడంతో బ్రదర్ అనిల్ స్వయంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని.. పాదయాత్ర చేయడం తప్పా? అని ప్రశ్నించారు.

అటు షర్మిల, ఇటు విజయమ్మలు పోలీసు నిర్బంధంలో ఉన్నారు. భర్త అనిల్ ఇప్పుడు వీరిని విడిపించేందుకు బయలుదేరాడు. వీరి ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.