Begin typing your search above and press return to search.

రుణం తీసుకున్నది నిజమే.. భూ పత్రాలు అసలైనవే

By:  Tupaki Desk   |   1 July 2015 5:02 AM GMT
రుణం తీసుకున్నది నిజమే.. భూ పత్రాలు అసలైనవే
X
ఒక బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెంది ఎంపీ కొత్తపల్లి గీత సీబీఐ కేసు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమెపై ఛార్జిషీట్‌ దాఖలు చేయటంతో.. ఆమెను అధికారులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు. బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కు అయి.. నిధులను ఇతర కారణాలకు మళ్లించారన్నది ఆమెపై ఉన్న ఆరోపణ.

ఈ ఉదంతంలోకి వెళితే.. కొత్తపల్లి గీత భర్త విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి ఎండీగా ఉన్నారు. స్వల్ప కాలంపాటు భాగస్వామిగా వ్యవహరించారు. 2012లో ఆయన బయటకు వచ్చేశారు. 2009లో బ్యాంకు నుంచి భూమి పత్రాలు పెట్టి రూ.25కోట్లు రుణంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇచ్చిన పత్రాల్లో ఎలాంటి లోపాలు లేవని ఆమె వాదిస్తున్నారు.

అయితే.. సింగపూర్‌ కంపెనీతో భాగస్వామ్యం ఉందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కంపెనీ వాటాలు వెనక్కి తీసుకుందని.. భాగస్వామ్యం నుంచి తప్పుకోవటంతో తమకునష్టాలు వచ్చాయని చెబుతున్నారు. ప్రస్తుతం తాము తీసుకున్న రుణం వడ్డీతో సహా రూ.42.79కోట్లు ఉందని.. దాన్ని త్వరలోనే తీర్చేయనున్నామని చెప్పారు. సీబీఐ కేసును తాను ఎదుర్కొంటానని ఆమె ధీమాగా చెబుతున్నారు.

వ్యాపార అవసరాల కోసం తీసుకున్న రుణం వేరే వాటికి తరలించారన్న ఆరోపణల్లో నిజం లేదని.. లోన్‌ కోసం సమర్పించిన పత్రాలు నిజమైనవని అందులో ఎలాంటి తప్పునకు తాను పాల్పడలేదని ఆమె చెబుతున్నారు. తానేం తప్పు చేయలేదని ఎంతో ధీమాగా చెబుతున్న కొత్త పల్లి గీత వ్యవహారంలో సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.