Begin typing your search above and press return to search.

ఆర్కే విష‌యంలో బాబు జోక్యం త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   31 Oct 2016 5:19 AM GMT
ఆర్కే విష‌యంలో బాబు జోక్యం త‌ప్ప‌దా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో బలిమెల రిజర్వాయరు సమీపాన జరిగిన ఎన్‌ కౌంటర్ తాలుకు వేడి ఇంకా కొన‌సాగుతోంది. ఈ ఎన్ కౌంటర్లో దాదాపు 32 మంది మావోయిస్టుల‌ను పోలీసులు కాల్చివేసిన ఘ‌ట‌న మావోయిస్టులకు పెద్ద దెబ్బగా వ‌ర్ణిస్తున్న స‌మ‌యంలో సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌ద‌ర్శి రామకృష్ణ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్తు నాయకులను - ఆదివాసులను కోర్టులో హాజరుపరచాలని మరియు మావోయిస్టు అగ్ర‌నేత ఆర్కే ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని కోరారు.

ఏఓబీలో మావోల మ‌ర‌ణాన్ని బూటకపు ఎన్‌కౌంట‌ర్‌గా అభివ‌ర్ణించిన రామ‌కృష్ణ‌...ఒడిస్సా ప్రాంతమైనప్పటికీ ఏపీ డీజీపీ ప్రకటనలు చూస్తుంటే ఆంధ్ర ప్రాంతం పోలీసులే చురుకుగా ఇందులో పాల్గొన్నట్లుగా అర్థమవుతుందని అన్నారు. ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డున్న 9 మంది మావోయిస్టుల ఆచూకి తెలియ‌క‌పోవ‌డంతో వారంతా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తున్నదని అన్నారు. అలాగే మావోయిస్తు ప్రముఖ నేత ఆర్‌ కే (రామకృష్ణ) గాయపడి ఉన్నట్లుగా ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నట్లుగా ఆ పార్టీ వారు ఆందోళన చెందుతున్నార‌ని తెలిపారు. కావున పోలీసుల అదుపులో ఉన్నవారిని కోర్టులో హాజరు పరచడానికి తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా సీఎం చంద్ర‌బాబును కోరారు. అలాగే మావోయిస్టు అగ్రనేత ఆర్కే ప్రాణాలకు హాని కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే... మావో ఎన్‌ కౌంట‌ర్ ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పంద‌న త‌ప్ప‌నిస‌రి అని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/