Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ , బీజేపీల మ‌ధ్య మంట పెట్టిన ఆర్టిక‌ల్ 370

By:  Tupaki Desk   |   13 Jun 2021 4:30 AM GMT
కాంగ్రెస్ , బీజేపీల మ‌ధ్య మంట పెట్టిన ఆర్టిక‌ల్ 370
X
కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్య మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. కొన్నాళ్ల కింద‌ట కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. ర‌ద్దు చేసిన ఆర్టిక‌ల్ 370(జ‌మ్ము క‌శ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించే)ను తిరిగి పున‌రుద్ధ రించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందంటూ.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మ‌ధ్య ప్ర‌దేశ్ మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలేలా చేసింది.

క్ల‌బ్ హౌస్ కామెంట్లు!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దు అంశంపై పునరాలోచిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రకటనపై బీజేపీ నేత‌లు మండిపడింది. ఇదంతా `టూల్కిట్`లో భాగమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తన పేరును దేశ వ్యతిరేక క్లబ్హౌస్గా మార్చుకోవాలని చురకలంటించారు.

నోరు జారారా? వ్యూహ‌మా?
దిగ్విజయ్ సింగ్ ఓ పాకిస్థానీ జర్నలిస్ట్తో మాట్లాడుతూ... చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత అమిత్ మాల‌వీయ బహిర్గతం చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర.. కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇదే దిగ్విజయ్ సింగ్ గతంలో పుల్వామా దాడిని ప్రమాదంగా పేర్కొన్నారు. 26/11 దాడులను ఆరెస్సెస్ కుట్ర అని అభివర్ణించారు. ఆ సమయంలో పాకిస్థాన్కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడేమో.. మోడీ గద్దెదిగి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఆయన చెబుతున్నారు. ఇదంతా టూల్కిట్లో భాగం అని సంబిత్ పాత్ర దుయ్య‌బ‌ట్టారు.

మూకుమ్మ‌డి దాడి
ఇక‌, దిగ్విజయ్ వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తా కూడా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్ సైతం ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుకుంటోందని అన్నారు.ఇప్పుడు ఇదేమాట‌ను కాంగ్రెస్ నేత‌లు సైతం అంటున్నార‌ని విమ‌ర్శించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి కూడా ఫైర‌య్యారు.. కశ్మీరీల నుంచి దేశభక్తిని నేర్చుకోవాలంటూ దిగ్విజయ్కు చురకలంటించారు.

దిగ్విజయ్ ఏమన్నారంటే?
ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్ముకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడం బాధాకరమని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కశ్మీర్లో ప్రజాస్వామ్యం, మానవత్వం నశించాయని.. ప్రతి ఒక్కరినీ నిర్బంధించారని అన్నారు. ప్రభుత్వ సర్వీస్లలో కశ్మీర్ పండిట్లకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ విషయంపై తప్పక దృష్టిసారిస్తుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీల మ‌ధ్య కొత్త వివాదం రాజుకున్న‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.