Begin typing your search above and press return to search.

జగన్ మీడియాలో అలాంటి కథనం వచ్చిందంటే?

By:  Tupaki Desk   |   22 Aug 2021 8:13 AM GMT
జగన్ మీడియాలో అలాంటి కథనం వచ్చిందంటే?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదం మీద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ వాదనల్ని వినిపిస్తోంది. తమదే న్యాయమంటే.. తమదే న్యాయమని వాదించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవటమే మంచిదన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం మాట్లాడుకోవాలని సూచన చేయటం తెలిసిందే. రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన వాడిగా తనకు విషయాలు తెలుసు కాబట్టి.. ఈ సూచన చేస్తున్నట్లు చెప్పటమే కాదు.. ఈ కేసును తాను పర్యవేక్షించలేదన్న మాటను చెప్పటం తెలిసిందే.

అయితే.. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ మధ్య నెలకొన్న జలవివాదం విషయంలో కూర్చొని మాట్లాడుకోవటానికి పెద్దగా ఆసక్తి లేదన్న విషయాన్ని తమ చేతలతో చెప్పేశారు. అదే సమయంలో.. ఏపీ నీటి దోపిడీ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా విరుచుకుపడింది. ఎప్పటిలానే తన వాదనను మాత్రమే వినిపించింది తప్పించి.. వాస్తవాల జోలికి వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా తాజాగా రంగంలోకి దిగింది. శ్రీశైలంలో తెలంగాణ దందా పేరుతో ఒక కథనాన్ని అచ్చేసింది. ఇందులోతెలంగాణ తీరును తీవ్రంగా తప్పు పట్టింది.

అడే పనిగా విద్యుదుత్పత్తిని చేపడుతూ.. ప్రాజెక్టును ఖాళీ చేస్తూ.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అంతేకాదు.. విద్యుదుత్పత్తి విషయంలో కేంద్ర జల్ శక్తి శాఖ.. కృష్ణా బోర్డు ఆదేశాల్ని బేఖాతరు చేస్తున్నట్లుగా పేర్కొంది. రోజూ సగటున 3.15 టీఎంసీల అక్రమంగా నీటిని వినియోగిస్తుందని.. దీని కారణంగా నీటి నిల్వ 180.2 టీఎంసీలకు పడిపోయిందని పేర్కొంది. ఇప్పటికే సముద్రంలోకి 162.76 టీఎంసీల నీరు వెళ్లినట్లుగా పేర్కొంది.

''కొద్దిపాటి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న నీటినంతటినీ గేట్లు ఎత్తేసి దిగువకు వృథాగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా జూన్‌ 1 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 162.76 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 12న వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆ రోజున 884.4 అడుగుల్లో 211.96 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే రోజున సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో 589.5 అడుగుల్లో 311 టీఎంసీల నిల్వ ఉంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 878.40 అడుగుల్లో 180.28 టీఎంసీలకు తగ్గిపోయింది. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాలను వాడుకోనివ్వకుండా చేయడానికే తెలంగాణ సర్కార్‌ కావాల్సిగా విద్యుదుత్పత్తి చేస్తోందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు’’ అంటూ ఆరోపించింది.

అంతేకాదు.. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తుందని పేర్కొన్న సదరు కథనంలో.. కొన్ని అంశాల్ని ప్రస్తావించారు. వాటిని చూస్తే..

- శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే అంటే జూన్‌ 2న 808.5 అడుగుల్లో 33.43 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. ప్రాజెక్టు ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు.

- కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే దిగువన ఎలాంటి సాగు, తాగునీటి అవసరాలు లేకపోయినా జూన్‌ 2న తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. తెలంగాణ సర్కార్‌ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

- శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటిని తరలించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు.. చెన్నైకి తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కార్‌ తీరుతో ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగుల కంటే తగ్గిపోతే, కేటాయింపులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు నీటిని అందించలేము’ అని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు స్పష్టంగా వివరించింది.

- దీంతో తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డులు ఆదేశించాయి. అయినా సరే.. తెలంగాణ సర్కార్‌ ఖాతరు చేయకుండా రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోందని పేర్కొంది. ఇవే అంశాల్ని ఈ నెల 27న జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో ప్రస్తావించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తుందన్న ఈ కథనానికి కేసీఆర్ సర్కారు మీడియా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.