Begin typing your search above and press return to search.

కొత్త తరహా మాంసం వచ్చేస్తోందోచ్

By:  Tupaki Desk   |   14 March 2016 5:30 PM GMT
కొత్త తరహా మాంసం వచ్చేస్తోందోచ్
X
నాన్ వెజ్ అర్థం మొత్తంగా మారనుంది. నాన్ వెజ్ తినే వారిని తీవ్రంగా వ్యతిరేకించే వెజిటేరియన్లు ఇకపై తమ వాదనను మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. నాన్ వెజ్ తినే వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసే ప్రసంగాలకు కాలం చెల్లినట్లే. తాజాగా జరుగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చేసి కృత్రిమ మాంసం మార్కెట్లోకి వచ్చేందుకు కేవలం నాలుగేళ్లు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. నాన్ వెజ్ తినే విషయం ఎవరికి అభ్యంతరం కాబోదేమో.

నాన్ వెజ్ అన్న వెంటనే.. అమాయక ప్రాణుల్ని చంపేసి.. వాటి మాంసం తినటం ఏమిటంటూ పలు విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే.. ఆ స్థానే.. కృత్రిమ మాంసాన్ని తయారు చేయటంలో శాస్త్రవేత్తలు సక్సెస్ కావటేమ కాదు.. వీటిని అందరూ వినియోగించేలా మార్కెట్లోకి సరికొత్తగా తీసుకొచ్చే ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో.. నాన్ వెజ్ తయారీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.

నాన్ వెజ్ కోసం జంతువుల్ని చంపాల్సిన అవసరం లేకుండా.. కేవలం ల్యాబ్ లలోనే పెద్ద ఎత్తున తయారు కానుంది. కొన్ని జంతువుల్లోని కణాల్ని సేకరించి.. వాటికి ఆక్సిజన్.. పోషక పదార్థాలు అందించటం ద్వారా తొమ్మిది నుంచి 21 రోజుల్లో మాంసం ఉత్పత్తి అవుతుందన్నది తేలిపోయింది. దీనికి సంబంధించి అందరూ ఎక్కువగా వినియోగించే కోడి.. ఎద్దు.. పంది మాంసాలపై ప్రయోగాలు నిర్వహించి సక్సెస్ అయ్యారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కృత్రిమ మాంసాన్ని తయారు చేసే పెద్ద బాధ్యతను మీద వేసుకున్న శాస్త్రవేత్తల బృందంలో ఒక తెలుగు వ్యక్తి ఉండటం విశేషంగా చెప్పాలి. ఉమా వలేటి అనే తెలుగు శాస్త్రవేత్త కృత్రిమ నాన్ వెజ్ తయారీ బృందంలో ఉన్నారు. తాజాగా జరిపిన పరిశోధనలు సక్సెస్ కావటంతో నాలుగేళ్ల వ్యవధిలో ఈ నాన్ వెజ్ మార్కెట్లోకి రానుందని చెబుతున్నారు. ఈ నాన్ వెజ్ ప్రత్యేకత ఏమిటంటే.. కొవ్వుశాతం తక్కువగా ఉండటం.. బ్యాక్టీరియా వల్ల చెడిపోకుండా ఉండటమే కాదు.. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే వీలు ఉంటుంది. మూడేళ్లలో రెస్టారెంట్లలో.. ఐదేళ్లలో రిటైల్ మార్కెట్లలో ఈ మాంసం అందుబాటులోకి రానుంది. అదే జరిగితే.. నాన్ వెజ్.. వెజ్ మధ్య సంఘర్షణ చాలావరకు సమిసిపోతుందా..?