Begin typing your search above and press return to search.

‘హోదా’కు నో అంటూ ప్యాకేజీ సిద్ధం చేశారట

By:  Tupaki Desk   |   7 Sep 2016 3:33 AM GMT
‘హోదా’కు నో అంటూ ప్యాకేజీ సిద్ధం చేశారట
X
విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి ఏపీ విభజన చట్టంలో కొన్ని అంశాల్ని పేర్కొన్నారు. ఇవి కాకుండా.. బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ల పాటు అమలయ్యే ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రధానిగా ఆయన చెప్పిన ఈ మాటల్నే తర్వాతి కాలంలో బీజేపీ అగ్రనేతలు వల్లె వేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో పర్యటించిన నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ సైతం ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. అయితే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయాన్ని పక్కన పెట్టేయటమే కాదు..ఏపీకి హోదా ఇస్తే.. మరికొన్ని రాష్ట్రాలకూ ఇవ్వాల్సి వస్తుందంటూ మెలిక పెడుతూ.. గడిచిన 27నెలలుగా ఈ విషయాన్ని నానబెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో ప్రత్యేక హోదా అన్నది ఒక సెంటిమెంట్ గా మారటమే కాదు.. హోదాతోనే ఏపీ సమస్యల పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం రోజురోజుకీ పెరుగుతోంది. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. హోదా ఇవ్వకుండా.. ఎన్నివరాలు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్న బావన సీమాంధ్రుల్లో వ్యక్తమవుతోంది. అయినప్పటికీ హోదా ప్రకటన కంటే ప్రత్యేక ప్యాకేజీ అంటూ పలు వరాలు ప్రకటించాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లుగా చెబుతున్నారు.

హోదా మీద ఏపీలో చర్చ జోరందుకోవటం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం గళం విప్పి.. ఉద్యమబాట పడుతానని వెల్లడించిన నేపథ్యంలో ఏపీ అంశంపై కేంద్రం సీరియస్ గా ఫోకస్ చేసింది. గడిచిన కొద్ది రోజులుగా చర్చల మీద చర్చలు జరుపుతున్న కేంద్రం.. ఏపీకి ఏం ఇవ్వాలన్న అంశంపై ఒకముసాయిదాను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.ఈ ప్యాకేజీ వివరాల్ని ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

కేంద్రం ప్రకటించే ప్యాకేజీని పరిశీలించి.. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత స్పందించాలని ఏపీ అధికారపక్షం డిసైడ్ చేసింది.ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రకటించే ప్యాకేజీలో ఎలాంటి అంశాలు ఉంటాయన్న అంశంపై వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. అనధికారికంగా వచ్చిన ఈ వివరాల్లో నిజం ఎంతన్నది ఒక సందేహం. ఇక.. బయటకు వచ్చిన ఏపీ ప్యాకేజీ సమాచారాన్ని చూస్తే..

1. హోదా లేకున్నా కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్లుగా ఇచ్చేలా ప్రకటన (ప్రత్యేక హోదా అయితే ఇలానే ఇస్తారు)

2. కేంద్ర కార్యక్రమాల్లో 90 శాతం గ్రాంటు ఇస్తే.. ఇప్పుడొచ్చే నిధులకు ఏటా మరో రూ.3వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశం

3. పోలవరం ప్రాజెక్టుకు 90శాతం ఖర్చు కేంద్రం భరించేలా నిర్ణయం. తొలివిడతలో నాబార్డు నుంచి రుణంగా తీసుకొని దాన్ని కేంద్రమే చెల్లిస్తుంది

4. ప్రత్యేక హోదా అన్నది ఉండదు.

5. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రెవెన్యూ లోటు దాదాపు రూ.7 నుంచి రూ.9వేల కోట్లు మధ్య డిసైడ్ చేసే వీలు. ఇప్పటికే లోటు భర్తీ కోసం రూ.3979 కోట్లు ఇచ్చారు.

6. తాజా ప్యాకేజీలో మిగిలిన మొత్తాన్ని విడుదల చేసే వీలు. తొలి ఏడాది రెవెన్యూ లోటును రూ.16వేల కోట్లుగా ఏపీ సర్కారు చెబుతుంటే.. కేంద్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మధ్యే మార్గంగా రూ.7 నుంచి రూ.9వేల కోట్ల మధ్య నిర్ణయించే వీలు.

7. జీఎస్టీ నేపథ్యంలో పన్ను రాయితీలు సాధ్యం కాని నేపథ్యంలో రూ.500 కోట్లతో పన్ను రాయితీ నిధి ఏర్పాటు చేసి కొన్ని పరిశ్రమలకు రాయితీలు.

8. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లుగా చెబుతున్నారు. దీనికి సంబందించి అంతిమ నిర్ణయం ఇంకా తీసుకోలేదు.

9. ఒడిశా.. ఛత్తీస్ గఢ్ లతో సంబంధం లేకుండా విజయవాడ కేంద్రం ప్రత్యేక రైల్వే జోన్

10. రాష్ట్రానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని వివిధ బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇవ్వటం..వాటిని కేంద్రమే తీర్చేలా ప్రతిపాదన