Begin typing your search above and press return to search.

అడిగోళ్ల‌కు హ్యాండు.. అడ‌గ‌నోళ్ల‌కు షేక్ హ్యాండ్‌

By:  Tupaki Desk   |   1 Feb 2018 7:43 AM GMT
అడిగోళ్ల‌కు హ్యాండు.. అడ‌గ‌నోళ్ల‌కు షేక్ హ్యాండ్‌
X
గ‌డిచిన బ‌డ్జెట్ల‌కు భిన్నంగా సాగుతోంది కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగం. గ‌తానికి భిన్నంగా తాయిలాల మీద తాయిలాలు ప్ర‌కటిస్తున్నారు. ఇప్ప‌టికే వ్య‌వ‌సాయ‌.. గ్రామీణ రంగాల‌కు ప్ర‌క‌టించ‌టంతో పాటు.. దేశంలో మొద‌టిసారి ఆరోగ్య బీమాకు సంబంధించి భారీ ప్ర‌క‌ట‌న‌ను చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ‌డ్జెట్ లో మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి.. గ‌వ‌ర్న‌ర్ల జీతాల్ని పెంచుతున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రప‌తి గౌర‌వ వేత‌నాన్ని నెల‌కు రూ.5ల‌క్ష‌లు.. ఉప రాష్ట్రప‌తికి రూ.4ల‌క్ష‌లు.. గ‌వ‌ర్న‌ర్ల‌కు రూ.3.5ల‌క్ష‌ల మేర పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు. జైట్లీ నోటి నుంచి ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చినంత‌నే పార్ల‌మెంట్ మొత్తం శ‌బ్దాల‌తో నిండిపోయింది. జైట్లీ ప్ర‌క‌ట‌న‌ను అధికార‌ప‌క్షానికి చెందిన వారు మ‌ద్ద‌తుగా శ‌బ్దం చేస్తే.. అందుకు భిన్నంగా విప‌క్ష నేత‌లు వ్య‌వ‌హ‌రించారు. ఈ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కొన్ని సెక‌న్ల పాటు త‌న ప్ర‌సంగాన్ని నిలిపిన జైట్లీ.. మ‌రో ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న‌ను తాను చేస్తున్న‌ట్లు చెప్పారు.

స‌భ్యులు సావ‌ధానంగా వినాల‌ని.. తాను చేస్తున్న ప్ర‌క‌ట‌న కచ్ఛితంగా స‌భ‌లోని స‌భ్యులంద‌రిని సంతృప్తి ప‌రుస్తుంద‌న్న జైట్లీ.. ఎంపీల వేత‌నం మీద ప్ర‌క‌ట‌న చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ స‌మ‌యంలో పార్ల‌మెంటు మొత్తం సైలెంట్ అయ్యింది. సూది ప‌డ్డ విన‌ప‌డేంతలా ప‌రిస‌రాలు మారాయి. ఇలాంటి వేళ‌.. ఎంపీల జీతాల‌కు సంబంధించి జైట్లీ ఎలాంటి వ‌రాన్ని ఇస్తారోన‌న్న ఆస‌క్తి వ్య‌క్త‌మైంది.

అయితే.. వీరి ఆస‌క్తి మీద నీళ్లు చ‌ల్లుతూ.. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి ద్ర‌వ్యోల్బణానికి అనుగుణంగా గౌర‌వ‌వేత‌నాల్ని మారుస్తార‌న్నారు. ఈ మార్పు స‌భ్యుల్ని త‌ప్ప‌నిస‌రిగా సంతృప్తి ప‌రుస్తుంద‌న్న అభిప్రాయాన్ని జైట్లీ త‌న ప్ర‌సంగంలో వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. జైట్లీ పెంచిన రాష్ట్రప‌తి గౌర‌వ వేత‌నాన్ని చూస్తే.. గ‌త ఏడాది అక్టోబ‌రులో రూ.1.5ల‌క్ష‌ల నుంచి రూ.5ల‌క్ష‌ల‌కు పెంచారు. అంటే.. తాజా ప్ర‌క‌ట‌న‌తో రాష్ట్రప‌తి గౌర‌వ వేత‌నం ఏ మాత్రం పెర‌గ‌లేద‌ని చెప్పాలి. అదే స‌మ‌యంలో ఉప రాష్ట్రప‌తి గౌర‌వ‌వేత‌నం కాస్త పెర‌గ్గా.. గ‌వ‌ర్న‌ర్ల వేత‌నం మాత్రం భారీగా పెరిగాయ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. గ‌త అక్టోబ‌రులో ఉప రాష్ట్రప‌తి గౌర‌వ వేత‌నాన్ని రూ.3.5ల‌క్ష‌ల‌కు పెంచారు. దానికి మ‌రో రూ.50వేలు పెంచ‌గా.. గ‌వ‌ర్న‌ర్ల జీతంలో మాత్రం భారీ వ్య‌త్యాసం క‌నిస్తుంది. గ‌త అక్టోబ‌రులో గ‌వ‌ర్న‌ర్ల గౌర‌వ వేతనం రూ.1.10ల‌క్ష‌లు కాస్తా తాజాగా జైట్లీ చేసిన ప్ర‌క‌ట‌న‌తో రూ.3.5ల‌క్ష‌ల‌కు చేర‌నుంది.

జైట్లీ చేసిన తాజా ప్ర‌క‌ట‌న‌తో గ‌వ‌ర్న‌ర్ల గౌర‌వ వేత‌నానికి.. ప్ర‌ధాని గౌర‌వ వేతానికి మ‌ధ్య వ్యత్యాసం చాలా మేర త‌గ్గిపోయింది.