Begin typing your search above and press return to search.

వ‌చ్చేస్తున్నాయ్‌.. ఎన్నిక‌ల బాండ్లు

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:34 AM GMT
వ‌చ్చేస్తున్నాయ్‌.. ఎన్నిక‌ల బాండ్లు
X
రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు ఇచ్చే వారి లెక్క ఇక అధికారం కానుంది. ఎవ‌రు ఏ పార్టీకి ఎంత మొత్తాన్ని ఇచ్చార‌న్న విష‌యంపై లెక్క‌లు తేల్చేందుకు వీలుగా కొత్త లెక్క‌ల్ని తీసుకొచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌కీయ పార్టీల‌కు విరాళాల్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా ఇచ్చేవారు. ఇక‌పై అలాంటిది కుద‌ర‌దు. గుర్తింపు పొందిన పార్టీల‌కు విరాళాలు ఇచ్చే వారు.. ప్ర‌భుత్వం జారీ చేసిన బాండ్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వెయ్యి రూపాయిలు మొద‌లుకొని కోటి రూపాయిల డినామినేష‌న్ తో ఈ బాండ్లు ఉండ‌నున్నాయి. ఎస్‌ బీఐ నుంచి వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎవ‌రైనా రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు ఇవ్వాల‌నుకుంటే.. వారు ఎస్ బీఐ నుంచి బాండ్ల‌ను కొనుగోలు చేయొచ్చు. అయితే.. బాండ్లు కొనుగోలు చేసేట‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి త‌మ వివ‌రాల్ని అందించాల్సి ఉంటుంది. దీంతో.. ఎవ‌రు ఎంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వ‌టానికి బాండ్లు కొనుగోలు చేశార‌న్న విష‌యంపై ఒక లెక్క వ‌చ్చేస్తుంది.

ఈ బాండ్ల అమ్మ‌కం ఏడాది మొత్తం కాకుండా జ‌న‌వ‌రి.. ఏప్రిల్‌.. జులై.. అక్టోబ‌రు నెల‌ల్లో ప‌ది రోజుల చొప్పున అమ్మ‌కాలు నిర్వ‌హిస్తారు. ఈ టైంలో బాండ్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్లు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ప్రామ‌స‌రీ నోట్ల మాదిరి ఉంటాయి. ఈ నోటు మీద‌.. దాని విలువ తెలియ‌జేసేలా ఉంటాయి. వీటిని బ్యాంకు నుంచి కొనుగోలు చేసిన వ్య‌క్తి తాము ఇవ్వాల‌నుకున్న బ్యాంకుకు 15 రోజుల వ్య‌వ‌ధిలో ఇవ్వాల్సి ఉంటుంది.

బాండ్ల జీవిత కాలం 15 రోజులు మాత్ర‌మే ఉంటుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో మాత్రం 30 రోజుల వ‌ర‌కూ ఉంటుంది. ఈ బాండ్ల‌ను భార‌తీయులే కాదు విదేశీయులు కూడా కొనుగోలు చేసే వీలు ఉంటుంది. కాకుంటే.. బ్యాంకు నుంచి కొనుగోలు చేసిన బాండ్ల‌ను..కొన్న తేదీ నుంచి 15 రోజుల లోపు రాజ‌కీయ‌పార్టీల‌కు ఇవ్వ‌టం.. వారు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవ‌టం పూర్తి కావాల్సి ఉంటుంది. దీంతో.. రాజ‌కీయ పార్టీల‌కు అందే నిధుల‌కు సంబంధించి అధికారికంగా లెక్క‌లు ప్ర‌భుత్వానికి తెలిసే వీలు ఉంటుంది. బాండ్ల‌ను కొనుగోలు చేసినప్పుడు బ్యాంకుకు ఇచ్చే డ‌బ్బుల‌కు ర‌క్ష‌కుడిగా ఎస్ బీఐ వ్య‌వ‌హ‌రించ‌నుంది. రాజ‌కీయ‌పార్టీలుగా రిజిస్ట‌ర్ అయిన పార్టీల‌కు విరాళాల్ని బాండ్ల రూపంలో మాత్ర‌మే ఇవ్వాల‌న్న మాట‌ను కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. విన్నంత‌నే అంతా ప‌క్కాగా ఉంద‌నిపించినా.. ఆచ‌ర‌ణ‌లో ఎలాంటి లోటుపాట్లు తెర మీద‌కు వ‌స్తాయో చూడాలి.