Begin typing your search above and press return to search.

సుజ‌నాతో జైట్లీ రాయ‌ 'బేరం'?

By:  Tupaki Desk   |   23 March 2018 10:28 AM GMT
సుజ‌నాతో జైట్లీ రాయ‌ బేరం?
X
హోదా కోసం ఏపీ అధికార‌ప‌క్షం ఆందోళ‌న‌ను మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. మొద‌ట్లో హోదా త‌ప్పితే మ‌రింకేమీ వ‌ద్ద‌న్న బాబు.. త‌ర్వాతి కాలంలో నాలుక మ‌డ‌త పడిపోయిన‌ట్లుగా హోదా కాదు.. ప్యాకేజీ ముద్దు అని మాట్లాడ‌ట‌మే కాదు.. దానికి అనుకూలంగా వాదించటం తెలిసిందే. హోదా ఇష్యూలో ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ‌.. ప్యాకేజీ మాట మాట్లాడితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న భావ‌న బాబుకు రావ‌టం.. ఆ వెంట‌నే మోడీ స‌ర్కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌టం లాంటివి చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

మోడీ స‌ర్కారు నుంచి మంత్రులు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎన్డీయే కూట‌మి నుంచి కూడా వైదొలిగిన‌ట్లుగా బాబు ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి మోడీ స‌ర్కారుపై బాబు చేస్తున్న విమ‌ర్శ‌లు అన్నిఇన్ని కావు. రోజుకు మూడు నాలుగు సార్లు తెలుగు త‌మ్ముళ్ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌కు తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

త‌న‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడార‌ని.. రైల్వేజోన్.. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీతో స‌హా అన్నీ ఇస్తామ‌న్నార‌ని. ప్ర‌త్యేక హోదా గురించి మాత్రం చెప్ప‌లేద‌ని.. ఏం చేయాలంటూ సుజ‌నా వేసిన ప్ర‌శ్న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. జైట్లీ త‌న‌తో మాట్లాడిన విష‌యంపై తెలుగు త‌మ్ముళ్లు ఒక్కొక్క‌రిగా రియాక్ట్ అయ్యారు.

రాష్ట్ర మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడుతూ.. అన్ని విష‌యాల‌పై కేంద్రం స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన బాధ్య‌త ఉంద‌ని.. ఎక్క‌డైనా బ‌య‌ట ఏదైనా వేదిక ద‌గ్గ‌ర మ‌ర్యాద‌పూర్వ‌కంగా జైట్లీ మాట్లాడితే మాట్లాడ‌టం త‌ప్పు కాదు కానీ.. ఆయ‌న ఛాంబ‌ర్ కు వెళితే మాత్రం త‌ప్పుడు సంకేతాలు అందుతాయ‌ని వ్యాఖ్యానించారు.

య‌న‌మ‌ల మాట‌ల్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా మిగిలిన నేత‌లు స‌మ‌ర్థించారు. జైట్లీ మాట్లాడిన విష‌యాన్ని.. ఆయ‌న చెప్పిన మాట‌ల్ని న‌లుగురి మ‌ధ్య‌లో చ‌ర్చ‌కు పెట్ట‌టం ద్వారా సుజ‌నా.. బాబు భారీ ప్లాన్ వేసిన‌ట్లుగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

తాము చేస్తున్న ఆందోళ‌న‌కు కేంద్రంలో క‌ద‌లిక వ‌చ్చింద‌ని.. త‌మ‌కు ఆఫ‌ర్లు ఇచ్చినా తాము వెన‌క్కి త‌గ్గ‌కుండా హోదా కోసం పోరాడుతున్నామ‌న్న క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శించే వ్యూహంలో భాగంగానే సుజ‌నా చేత టెలికాన్ఫ‌రెన్స్ లో జైట్లీ మాట‌ను బాబు చెప్పించి ఉంటార‌న్న మాట వినిపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్ల‌కే ఎరుక‌. మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. సుజ‌నా మాట‌తో అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. బాబు బ్యాచ్ తో మోడీ బ్యాచ్ ట‌చ్ లోనే ఉంద‌న్న మాట‌..?