Begin typing your search above and press return to search.

అబ్బో తెదేపా మీద జైట్లీకి ఎంత నమ్మకమో!

By:  Tupaki Desk   |   5 Feb 2018 5:46 AM GMT
అబ్బో తెదేపా  మీద జైట్లీకి ఎంత నమ్మకమో!
X
ఒకవైపు తెలుగుదేశానికి చెందిన ఎంపీలందరూ భాజపాతో మైత్రికి ఇక చెల్లినట్టే.. మేం ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసేస్తాం.. మా అధినేత తో మీటింగ్ తర్వాత డిసైడ్ చేస్తాం.. అంటూ ఆదివారం ఉదయం వరకూ వీర బీభత్స రేంజిలో రంకెలు వేస్తూనే ఉన్నారు కదా.. అయినా సరే అలాంటి పరిస్థితుల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలుగుదేశం మీద , వారు తమ పార్టీకి కటీఫ్ చెప్పి ఎక్కడకూ వెళ్లలేరనే ఆలోచన మీద తెగ నమ్మకం ఉన్నట్లుంది. అందుకే ఆయన ఓ ఇంగ్లిషు టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2019 ఎన్నికల్లో కూడా భాజపా - తెదేపా కలిసే పోటీ చేస్తాయంటూ చాలా నమ్మకంగా తేల్చి చెప్పారు.

బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి సంబంధించి... నిందలు మొత్తం ఆర్థిక మంత్రి గనుక అరుణ్ జైట్లీకే దక్కుతాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం సమష్టిగా చేసే నిర్ణయాలే అయినప్పటికీ.. బడ్జెట్ అంటే ప్రధానంగా డబ్బు కేటాయింపుల వ్యవహారం గనుక.. ఆర్థికమంత్రి పాత్రే ఎక్కువ. కేవలం ఆ ఒక్క కారణం మీదనే కాదు.. గత మూడున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పట్ల - అవసరాల పట్ల చూపిస్తున్న చులకన భావం... హోదాకు ఎగనామం పెట్టి ప్యాకేజీ ఇస్తాం అంటూ మభ్యపుచ్చడం - ప్యాకేజీ కి సంబంధించిన కేటాయింపులు కూడా ఏమాత్రం రాష్ట్రప్రభుత్వానికి విడుదల చేయకుండా.. మీన మేషాలు లెక్కించడం.. కనీసం రెవెన్యూ లోటును పూడ్చే నిధుల విడుదలకు కూడా వంద రకాల క్వర్రీలు చెబుతుండడం ఇత్యాది అనేక అంశాలను కలుపుకున్నప్పుడు.. ఇప్పుడు కేటాయింపులు లేకపోవడానికి కూడా ఈయనే బాద్యుడని అందరూ జైట్లీనే తిట్టుకున్నారు.

అయితే జైట్లీ మాత్రం చాలా ధీమాగా.. టీవీ ఇంటర్వ్యూలు తమ పార్టీలు కలిసే పోటీచేయబోతున్నాయని చెప్పారు. అంటే తాము ఏం చేసినా చెల్లుతుందని, తమను వీడి ఎన్డీయే నుంచి బయటకు పోయే దమ్ము తెలుగుదేశానికి లేదని.. జైట్లీకి ఘనంగా నమ్మకం ఉన్నట్లున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఎంత నమ్మకం లేకపోతే.. ఒకవైపు ఇంతగా వ్యతిరేకత చెలరేగుతున్న సమయంలోనూ అంత ధీమాగా చెప్పగలరని ప్రజలు భావిస్తున్నారు.