Begin typing your search above and press return to search.

పాతిక ల‌క్ష‌లిస్తే..మోడీ టీం దేశం దాటించేస్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   23 Oct 2018 7:38 AM GMT
పాతిక ల‌క్ష‌లిస్తే..మోడీ టీం దేశం దాటించేస్తుంద‌ట‌!
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధికార బీజేపీపై త‌న విమ‌ర్శ‌ల దూకుడును కొన‌సాగిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ స‌హా ఆయ‌న బృందాన్ని ఇరుకున పెట్టే ఏ అంశాన్ని రాహుల్ వ‌దుల‌కోవ‌డం లేదు. తాజాగా బ్యాంకులకు వేల కోట్ల మేర రుణం ఎగవేసి దేశం విడిచిపారిపోయిన ఆభరణాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఎపిసోడ్‌ కు ఆయ‌న మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. చోక్సి వద్ద కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె - అల్లుడు పనిచేశారని కాంగ్రెస్ ర‌థ‌సార‌థి పేర్కొంటూ న్యాయవాదులైన ఆ ఇద్దరు తమ పనికి రూ.24 లక్షలు పరిహారం పొందారని ఆరోపించారు. ఆర్థికమంత్రి జైట్లీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఛత్తీస్‌ గఢ్‌ లోని రాయపూర్‌ లో సోమవారం జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. `రూ.35వేల కోట్ల డబ్బును దొంగిలించి పారిపోయిన నీరవ్ మోదీ - మెహుల్ చోక్సీ గురించి మీరు వినే ఉంటారు. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తెకు చెందిన బ్యాంక్ అకౌంట్‌ లో చోక్సీ లక్షల రూపాయల డిపాజిట్ చేశారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన చోక్సీపై ఆర్థికమంత్రి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం వల్లనే ఆయన దేశం విడిచి పారిపోయారు.`` అని ఆరోపించారు. ``దొంగ మెహుల్ చోక్సీ వద్ద కుమార్తె జీతం తీసుకుంటున్నారు. ఆర్థికమంత్రి అయిన తండ్రి చోక్సీ ఫైల్‌ ను తొక్కిపెట్టేస్తే.. ఆయన దేశం వదలి పారిపోయాడు`` అని ట్వీట్ చేశారు.

మ‌రోవైపు ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ సంస్థ నుంచి గత డిసెంబర్‌లో జైట్లీ కుమార్తె సొనాలీ - అల్లుడు జైయేశ్ బక్షి రూ.24 లక్షలు తీసుకున్నారని చెప్పారు. మోదీ సర్కార్‌ కు -ఆర్థిక నేరగాళ్లకు మధ్యనున్న సంబంధాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. చోక్సీ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ/ఈడీ జైట్లీ కుమార్తె - అల్లుడ్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా జైట్లీని మంత్రివర్గం నుంచి తొలిగించి స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మెహుల్ చోక్సీ - నీరవ్ మోదీ - గీతాంజలి జెమ్స్‌ పై పలు ఫిర్యాదులు వచ్చినా - ఎఫ్ ఐఆర్‌ లు నమోదైనా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని - వారిని ఎవరు రక్షించారని నిలదీశారు. చోక్సీకి వారు ఎటువంటి సేవలు అందించనప్పటికీ జైట్లీ కూతురు - అల్లునికి ఆయన రూ.24 లక్షలు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. మోదీ సర్కార్ పాలనలో ఈ ఏడాది జనవరి నాటికి 44 నెలల్లో రూ.90 వేల కోట్ల విలువైన 19వేల బ్యాంక్ మోసాల కేసులు బట్టబయలయ్యాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం క‌ళ్ల‌ ఎదుట నుంచి 23 మంది మోసగాళ్లు రూ.53వేల కోట్లను తీసుకొని దేశం విడిచి పారిపోయారని ఆరోపించారు.

కాగా, ఈ ప‌రిణామంపై వెంట‌నే బీజేపీ నేత‌లు స్పందించారు. చోక్సీ సంస్థ ఆర్థిక నేరానికి పాల్పడినట్టు వెల్లడి కాగానే తమ న్యాయ సంస్థ రూ.24 లక్షలను తిరిగి చెల్లించిందని జైట్లీ అల్లుడు జైయేశ్ బక్షి తెలిపారు.