Begin typing your search above and press return to search.

జైట్లీ బడ్జెట్ మీద ఎవరేం కోరుకుంటున్నారు?

By:  Tupaki Desk   |   29 Feb 2016 4:02 AM GMT
జైట్లీ బడ్జెట్ మీద ఎవరేం కోరుకుంటున్నారు?
X
మరికొద్ది గంటల్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11 గంటల వేళ ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ అన్న వెంటనే లెక్కలు చాలానే ఉంటాయి. ఆదాయం.. వ్యయం.. రాబడులు.. ఖర్చులు.. పన్నులు.. ఇలాంటివి చాలానే ఉంటాయి. వీటన్నింటిని పక్కన పెట్టి సిం‘‘ఫుల్’’గా ఏయే వర్గాలు ఏమేం కోరుకుంటున్నాయి? అన్న విషయాల మీద దృష్టి పెడితే..

సగటు ఉద్యోగులు

కోట్లాది మంది ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది వ్యక్తిగత పన్ను మినహాయింపు. కనీసం రూ.3లక్షల వరకు అయినా ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తారని ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే నెలకు రూ.25 వేలు సంపాదించే కుటుంబాలపై రూపాయి కూడా పన్ను పడకుండా ఉండే వెసులుబాటు ఉంటుంది.

రైతులు

ప్రకృతి విపత్తులు.. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వచ్చి పడిన కరవును ఎదుర్కొనేందుకు వీలుగా వ్యవసాయ రంగానికి భారీ మద్దతు కల్పించాలని ఆశిస్తున్నారు. రాయితీలు..ప్రోత్సాహకాలతో రైతుకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నారు.

మొబైళ్లు.. కంప్యూటర్లు

మనిషి దేహంలో అవయువంగా మారిన సెల్ ఫోన్ కు సంబంధించి డిఫరెన్షియల్ ట్యాక్స్ విధానాన్ని పదేళ్ల పాటు పొడిగించాలని ఆ రంగానికి చెందిన వారు కోరుకుంతున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా ఉత్పత్తికి పెద్దపీట వేయాలని.. భారీ రాయితీలు ప్రకటించాలని కోరుతున్నారు. అదే జరిగితే మొబైల్ మరింత చౌకగా లభ్యమయ్యే వీలుంది.

మీడియా

విపరీతంగా పెరిగిన న్యూస్ ప్రింట్ భారాన్ని పత్రికలకు తగ్గించేందుకు వీలుగా న్యూస్ ప్రింట్ పై ఉన్న వ్యాట్ ను మినహాయించాలని మీడియా సంస్థలు కోరుతున్నాయి. మీడియా సంస్థల మాటకు జైట్లీ కానీ ఓకే చెప్పి.. సానుకూలంగా స్పందిస్తే ప్రచురణ సంస్థలపై భారం భారీగా తగ్గే వీలుంది.

వినోద రంగం

వినోద రంగానికి.. మీడియాకు చెందిన పన్నుల్ని హేతుబద్ధీకరించాలి. దీంతో వారిపై భారం తగ్గే వీలుంటుంది.

కార్పొరేట్ రంగం

పన్ను సంబంధిత చట్టాల్ని సరళీకరించటంతో పాటు.. అనుమతుల కోసం ఇప్పుడున్న పద్ధతుల్ని మరింత సులభతరం చేయాలి. పన్నుల విధానాన్ని మార్చాలి.

స్టార్టప్స్

దేశ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే సత్తా ఉందని భావిస్తున్న స్టార్టప్ లకు మరింత ప్రోత్సాహకరంగా ఉండేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆశిస్తున్నారు. పన్ను మినహాయింపులతో పాటు.. ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని వారు ఆశిస్తున్నారు.

మొత్తంగా..

పన్ను పోటు తక్కువగా.. రాయితీలు ఒక మోస్తరుగా కోరుకుంటున్నారు. బాదుడు కొరడా తమ మీద పడకుంటే చాలన్నది ప్రతి ఒక్కరి ఆశ. అది నిజం కావాలంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్నది మౌలిక ప్రశ్న. ఎవరెన్ని అభిప్రాయాలు వెల్లడించినా.. ఆఖరకు జైట్లీ ఏం చేస్తారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.