Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి సెల‌వుపై జైట్లీ క్లారిటీ!

By:  Tupaki Desk   |   24 Oct 2018 10:48 AM GMT
అర్థ‌రాత్రి సెల‌వుపై జైట్లీ క్లారిటీ!
X
మూడు రోజుల వ్య‌వ‌ధిలో సీన్ మొత్తం మారిపోవ‌టం తెలిసిందే. సీబీఐ బాస్‌.. ఉప బాస్ ల మ‌ధ్య గొడ‌వ‌లు.. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం.. సీబీఐ మీద సీబీఐ సోదాలు లాంటి ప‌నుల‌తో ఆ ద‌ర్యాప్తు సంస్థ‌పై ఉన్న గౌర‌వ మ‌ర్యాద‌ల‌పై నీలినీడ‌లు ప‌రుచుకుంటున్న వేళ‌.. ఈ వ్య‌వ‌హారం నెమ్మ‌దిగా మోడీ స‌ర్కారు మెడ‌కు చుట్టుకునే ప‌రిస్థితి. దీంతో.. ఈ వ్య‌వ‌హ‌రాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా రంగంలోకి దిగారు.

ప‌రిస్థితి తీవ్ర‌త‌ను గుర్తించిన ఆయ‌న ఉప‌శ‌మ‌న మందు కంటే శ‌స్త్ర‌చికిత్స మంచిద‌న్న విష‌యాన్ని గుర్తించి.. రాత్రికి రాత్రి ఇద్ద‌రు సీబీఐ బాస్ లు (అలోక్ వ‌ర్మ‌.. రాకేశ్ ఆస్థానా) సెల‌వుపై పంపారు. అదే స‌మ‌యంలో కొత్త సీబీఐ బాస్ గా తెలుగోడు మ‌న్నెం నాగేశ్వ‌ర‌రావును రంగంలోకి దింపారు.

తెల్ల‌వారుజాము 2 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న త‌న ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌టం.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలోని 10.. 11 అంత‌స్తుల్లో త‌నిఖీలు నిర్వ‌హించి.. రెండు గ‌దుల్ని సీజ్ చేయ‌టం లాంటి ప‌రిణామాలు చ‌కాచ‌కా చోటు చేసుకున్నాయి.

దీంతో మోడీ స‌ర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల్ని గుప్పించేస్తున్న విప‌క్షాల పుణ్య‌మా అని.. ఈ అంశాల మీద క్లారిటీ ఇచ్చేందుకు మీడియా ముందుకు వ‌చ్చారు కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. సీబీఐ అధికారుల్ని సెల‌వుల మీద పంప‌టానికి కార‌ణాలు చెప్పుకొచ్చారు.

ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నార‌ని.. అందుకే వారిద్ద‌రిని సెల‌వు మీద మాత్ర‌మే పంపిన‌ట్లు చెప్పారు. ఈ కేసు విచార‌ణ పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంద‌ని.. కేసును విచారించేందుకు కొత్త బృందాన్ని నియ‌మించిన‌ట్లు పేర్కొన్నారు. రాకేశ్ ఆస్థానాపై న‌మోదైన కేసును విచారించేందుకు సీబీఐ డీఐజీ త‌రుణ్ గోవా.. ఎస్పీ స‌తీశ్ దాగ‌ర్‌.. జాయింట్ డైరెక్ట‌ర్ వి. మురుగేశంను నియ‌మించిన‌ట్లు చెప్పారు. సీబీఐ ప్ర‌ధాన ద‌ర్యాప్తు సంస్థ అని.. దాని స‌మ‌గ్ర‌త‌ను.. విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడ‌టం ఎంతో అవ‌స‌ర‌మ‌నని జైట్లీ చెప్పారు.

ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. సీబీఐ స‌మ‌గ్ర‌త‌ను కాపాడ‌టం కోసం న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెప్పారు. అందులో భాగంగానే సీనియ‌ర్ అధికారుల‌ను సెల‌వుపై పంపిన‌ట్లు చెప్పారు. వారిపై ఉన్న కేసుల్ని సిట్ విచారిస్తుంద‌న్నారు. సీవీసీ ప్ర‌తిపాద‌న మేర‌కేప్ర‌భుత్వం సీబీఐ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జైట్లీ చెప్పారు.