Begin typing your search above and press return to search.

ఇల్లు క‌ద‌లని జైట్లీ!... మోదీ-షాల ఎఫెక్టేనా?

By:  Tupaki Desk   |   8 April 2018 10:29 AM GMT
ఇల్లు క‌ద‌లని జైట్లీ!... మోదీ-షాల ఎఫెక్టేనా?
X
ప్రస్తుతం కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారురు ఇంటా బ‌య‌టా ఎదురు గాలి వీస్తున్న విష‌యం బహిరంగ ర‌హ‌స్య‌మే. వివిధ ప్రాంతీయ పార్టీల‌తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా బీజేపీ స‌ర్కారుపై ఒంటికాలిపై లేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బాగానే తిప్పికొడుతున్న మోదీ అండ్ కో... స్వ‌ప‌క్షం నుంచి వినిపిస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సొంత పార్టీ నేత‌లు - అది కూడా పార్ల‌మెంటు స‌భ్యుల హోదాలో ఉన్న కొంద‌రు బీజేపీ నేత‌లు మోదీ తీరుపై బ‌హిరంగంగా చేస్తున్న విమ‌ర్శ‌లు నిజంగానే మోదీ టీమ్‌ కు బీపీ పెంచేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌రుస‌గా వినిపిస్తున్న ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సొంత పార్టీలోనే మోదీతో పాటు ఆయ‌నకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌ట్ల పార్టీలో అవిశ్వాసం స్థాయి అంచెలంచెలుగా పెరుగుతోంద‌న్న వాద‌న లేక‌పోలేదు. ఈ క్ర‌మంలోనే గ‌త వారం వెలుగు చూసిన ఓ కీల‌క అంశం ఇప్పుడు పార్టీలో పెద్ద చ‌ర్చ‌కే తెర తీసింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

న‌రేంద్ర మోదీ కేబినెట్ లో నెంబ‌ర్ 2 పొజిష‌న్ లో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి - బీజేపీ సీనియ‌ర్ నేత అరుణ్ జైట్లీ చాలా కాలంగానే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల కంటే ముందు నుంచే తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జైట్లీ ప‌లుమార్లు ఆసుప‌త్రిలో చేరారు. ఆ త‌ర్వాత మళ్లీ య‌ధావిధిగా త‌న విధుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే అనారోగ్య స‌మ‌స్య‌ల పేరు చెప్పి ఏనాడూ జైట్లీ త‌న విధుల‌కు దూరంగా ఉండ‌లేద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. అంతేకాకుండా అనారోగ్యం కార‌ణంగా త‌న ఇంటి నుంచే విధులు నిర్వ‌ర్తిస్తాన‌ని కూడా జైట్లీ చెప్పిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. ఇక ప్రస్తుత విష‌యానికి వ‌స్తే... మొన్నటి బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌మ‌యంలో కూడా జైట్లీ చాలా చురుకుగానే క‌నిపించారు. వ‌య‌సు మీద ప‌డుతున్నా - అనారోగ్య స‌మ‌స్య‌లు వేధిస్తున్నా కూడా త‌న విధి నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌న్న రీతిగా జైట్లీ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల్లో పార్ల‌మెంటులో క‌నిపించిన జైట్లీ పెద్ద‌గా ఇబ్బంది ప‌డుతున్న‌ట్లుగా క‌నిపించిన దాఖ‌లా కూడా లేద‌నే చెప్పాలి. మొత్తంగా జైట్లీకి ఇప్పుడు పెద్ద‌గా ఇబ్బందేమీ లేద‌న్న వాద‌న వినిపించింది.

అయితే పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగింపు ద‌శ‌కు వస్తున్న నేప‌థ్యంలో ఓ రెండు రోజుల క్రితం జైట్లీకి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తికర‌మైన వార్త వినిపించింది. స్వ‌యంగా జైట్లీనే స‌ద‌రు వార్త‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన‌ట్లుగానూ ప్ర‌చారం సాగింది. ఈ వార్త‌ను జైట్లీనే స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టిన వైనం నిజ‌మేన‌ని కూడా తేలిపోయింది. ఆ వార్త సారాంశం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న తాను ఇక‌పై త‌న కార్యాల‌యానికి వ‌చ్చి విధులు నిర్వ‌ర్తించ‌లేన‌ని, ఇంటి నుంచే విధులు నిర్వ‌ర్తిస్తాన‌ని జైట్లీ స్వ‌యంగా వెల్ల‌డించారు. జైట్లీ నుంచి ఈ ప్ర‌క‌ట‌న రావ‌డం వెనుక పెద్ద త‌తంగ‌మే న‌డిచింద‌ని ఇప్పుడు ఓ పెద్ద పుకారు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా జోక్యం నానాటికీ పెరిగిపోగా, ఇప్పుడు ఆ జోక్యం తారా స్థాయికి పెరిగింద‌ని, ఈ కార‌ణంగా జైట్లీ తీవ్రంగా మ‌న‌స్తాపానికి గుర‌య్యార‌ని, దీంతోనే తాను ఇంటి నుంచి ప‌నిచేస్తానంటూ కొత్త రాగం అందుకున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. షా జోక్యం అధికం కావ‌డం జైట్లీని పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌లేద‌ని, షాకు బ‌హిరంగంగానే మోదీ పూర్తి స‌హాయ స‌హ‌కారాల‌తో పాటు పూర్తిగా మ‌ద్దతు ల‌భిస్తున్న తీరు ఆయ‌న‌ను తీవ్ర మ‌న‌స్తాపానికి గురి చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే తాను ఇంటి నుంచే విధులు నిర్వ‌ర్తించ‌ద‌లచాన‌ని, అందుకు అనారోగ్య స‌మ‌స్య‌లే కార‌ణ‌మంటూ జైట్లీ చెబుతున్నార‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌చారంలో ఎంత‌మేర నిజ‌ముందో తెలియ‌దు గానీ... మొత్తంగా మోదీ - షాల‌కు ఎదురు గాలి వీయ‌డం ప్రారంభ‌మైపోయింద‌ని, భ‌విష్య‌త్తులో ఈ విభేదాలు మ‌రింత‌గా ముదిరితే ప‌రిస్థితి ఏమిట‌న్న దానిపై ఇప్పుడు పెద్ద చ‌ర్చ మొద‌లైపోయింద‌ని చెప్పాలి.