Begin typing your search above and press return to search.

జైట్లీ హెల్త్ పై ఆందోళన కలిగే రీతిలో తాజా హెల్త్ అప్డేట్

By:  Tupaki Desk   |   17 Aug 2019 5:20 AM GMT
జైట్లీ హెల్త్ పై ఆందోళన కలిగే రీతిలో తాజా హెల్త్ అప్డేట్
X
సుదీర్ఘకాలం వెయిట్ చేసిన తర్వాత చేతికి వచ్చిన పవర్ తో మోడీ చెలరేగిపోతూ.. బీజేపీని అంతకంతకూ బలమైన పార్టీగా మార్చేస్తున్న వైనం తెలిసిందే. ఒకప్పుడు లోక్ సభలో రెండండే రెండు సీట్లకే పరిమితమైన పార్టీ ఈ రోజున.. తన దరిదాపుల్లోకి మరే రాజకీయ పార్టీ రాలేనంత భారీగా పెరిగిపోయిన వైనం తెలిసిందే. కొందరు బీజేపీ నేతలకైతే.. తాము చూస్తున్నది నిజమేనా? అన్న సందేహాన్ని తమ ప్రైవేటు మాటల్లో వ్యక్తం చేస్తుంటారు కూడా.

నార్త్.. ఈస్ట్ అన్న తేడా లేకుండా ఏలేస్తున్న బీజేపీకి.. ఇప్పటికి కొరుకుడుపడని ప్రాంతం ఏదైనా ఉందంటే అది సౌత్ అనే చెప్పాలి. తాజాగా దక్షిణాది మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన మోడీషాలకు.. తరచూ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటున్నాయి. వారికి అత్యంత సన్నిహితులైన పలువురు పెద్ద నేతల ఆరోగ్యం ఆందోళన కరంగా మారటం వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి.

ఆ మధ్యన మనోహర్ పారీకర్.. ఇటీవల సుష్మా స్వరాజ్ లు హడావుడిగా అందరిని వదిలి వెళ్లిపోయిన వైనంతో కమలనాథుల్లో విషాదం కమ్ముకుంది. ఆ షాకుల నుంచి కోలుకోక ముందే మరో అగ్రనేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమంగా ఉండటం.. ఇంకోవైపు బీజేపీ పెద్దాయన అద్వానీ ఆరోగ్యం కూడా బాగా లేదన్న వార్తలు వస్తున్నాయి. అద్వానీ ఆరోగ్యం ఫర్లేదన్నట్లుగా ఉంటే.. అరుణ్ జైట్లీ ఆరోగ్యం ఏ మాత్రంబాగోలేదని చెబుతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ లోని అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెబుతున్నారు. 66 ఏళ్ల జైట్లీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న ఎయిమ్స్ వైద్యులు ఆయనకు అవసరమైన వైద్యాన్ని చేస్తున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆరా తీయటమే కాదు.. ఏకంగా ఎయిమ్స్ కు వచ్చారు. రాష్ట్రపతి ఆసుపత్రికి వస్తున్న వేళ.. కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్దన్.. సహాయమంత్రి అశ్విని చౌబేలు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పటికిప్పుడు జైట్లీ ఆరోగ్యం మీద చెప్పలేమని.. కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఈ సమాచారం బీజేపీ వర్గాలకు ఒకింత ఆవేదనను కలిగించటం ఖాయం.