Begin typing your search above and press return to search.

అచ్చే దిన్ తర్వాత.. బడ్జెట్ లో పోటు పక్కా?

By:  Tupaki Desk   |   30 Jan 2017 5:03 AM GMT
అచ్చే దిన్ తర్వాత.. బడ్జెట్ లో పోటు పక్కా?
X
దాదాపు రెండున్నరేళ్ల క్రితం వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా దేశం యావత్ నరేంద్రమోడీని ప్రధానిని చేయాలని కోరుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు సోషల్ మీడియాలో కొన్నిమేసేజ్ లు భారీగా తిరుగుతూ ఉండేవి. ఇప్పటితో పోలిస్తే.. అప్పటికి సోషల్ మీడియా చూపించే ప్రభావం ఎంతన్నది భారతీయ సమాజానికి పెద్దగా తెలీదనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ ధరలు.. వాటి తీరుతెన్నులు పేర్కొంటూ.. మోడీ కానీ ప్రధాని అయితే.. రేట్లు ఎంత భారీగా పడిపోతాయన్న విషయాన్ని లెక్కల సహితంగా చెప్పే వైనం కనిపించేది.

ఒక్క పెట్రోల్ ధరల్లోనే కాదు.. పన్నుల విషయంలోనూ ఇలాంటి వాదనే వినిపించేది. ఎన్నికలు ముగిసి.. అందరూ అనుకున్నట్లే మోడీ ప్రధాని అయిపోయారు. బడ్జెట్లు పెట్టేయటమే కాదు.. మరో బడ్జెట్ నుపెట్టటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ముందు వినిపించిన ప్రచారానికి తగ్గట్లు పెట్రోల్ ధరలు కానీ.. పన్నుపోటు ఏ మాత్రం తగ్గింది లేదు. ఆ మాటకు వస్తే.. ఈసారి బడ్జెట్ లో మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట తాజాగా వినిపిస్తోంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న 15 శాతం సేవాపన్ను.. ఈసారి బడ్జెట్ తర్వాత ఒకటి నుంచి రెండు శాతం వరకూ పెరిగే సూచనలు తప్పనిసరన్న మాట వినిపిస్తోంది. రానున్న బడ్జెట్ లో సేవాపన్నును 16 శాతం నుంచి 18 శాతం వరకూ ప్రతిపాదించాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. త్వరలో అమల్లోకి రానున్న జీఎస్టీ పుణ్యమా అని.. సేవాపన్ను పోటు ప్రజలకు మరింత భారం కానుందన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి యూపీఏ హయాంలో 12 శాతం మాత్రమే ఉండేది. మోడీ పవర్ లోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న 12.36 శాతాన్ని14శాతంగా పెంచారు. అనంతరం స్వచ్ఛభారత్ రుసుమును విధించారు. మరో 0.5శాతాన్ని గత బడ్జెట్ లో కృషి కల్యాణ్ యోజన కిందట పోటేశారు. ఈసారి సేవా పన్నును 16 నుంచి 18 శాతం మధ్యలో ఎంతోకొంత పెంచటమైతే ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. బాదించుకోవటానికి దేశ ప్రజలు మానసికంగా సిద్ధంకావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు. అదే జరిగితే అచ్చే దిన్ వచ్చేది ఎప్పుడో కానీ.. బాదుడు రోజులు మాత్రం వచ్చేశాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/