Begin typing your search above and press return to search.

రాహుల్‌ గాంధీ ఇంటికి జైట్లీ ఎందుకెళ్లారు?

By:  Tupaki Desk   |   19 Nov 2015 6:13 AM GMT
రాహుల్‌ గాంధీ ఇంటికి జైట్లీ ఎందుకెళ్లారు?
X
ఇటీవల దిల్లీలో రాజకీయ నాయకుల భేటీలు చాలా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ - ఆమె కుమార్తె ప్రియాంక గాంధీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇంటికి వెళ్లి చాలాసేపు గడిపారు. తాజాగా బీజేపీ నేత - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాహుల్ గాంధీని కలిసి చాలాసేపు ముచ్చటించారు. ఇదేంటి... అధికార - విపక్షాలు కలిసిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందా అనుకునేవారు ఎవరూ లేకపోయినా వచ్చే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ భేటీలు జరిగాయని చాలామంది భావిస్తున్నారు. కానీ, నిజానికి ఈ వైరి పార్టీల నేతల మధ్య భేటీలకు కారణాలు మాత్రం వేరే ఉన్నాయి. అవి వ్యక్తిగత కారణాలు కావడం విశేషం. అయితే... వ్యక్తిగత కారణాలతోనైనా సుహృద్భావంతో నేతల మధ్య మంచి సంబంధాలు మెంటైన్ కావడం మాత్రం మంచి విషయమే.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయన నివాసానికి వెళ్లి మరీ కలుసుకున్నారు. వీరిద్దరూ సుమారు అర గంట పాటు మాట్లాడుకున్నారు. తమ భేటీ వివరాలనూ ఇద్దరిలో ఎవరూ బయటపెట్టలేదు. జైట్లీని తన ఇంటి బయటకు వచ్చి మరీ సాదరంగా ఆహ్వానించిన రాహుల్ స్వయంగా లోపలికి తోడ్కొని వెళ్లారు. మరో ఐదు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న వేళ, కీలకమైన జీఎస్టీ బిల్లు - ఇటీవల ప్రకటించిన ఎఫ్‌ డిఐ సంస్కరణలు, తదితర అంశాలపై విపక్షాల మద్దతు కోరేందుకే ఆయన వెళ్లి ఉంటారని చాలామంది అంచనా వేస్తున్నారు. కానీ, అసలు విషయం వేరు. డిసెంబరు నెలలో జైట్లీ కుమార్తె సోనాలి పెళ్లి ఉంది. రాహుల్ గాంధీని - సోనియాను స్వయంగా ఆహ్వానించేందుకు జైట్లీ వెళ్లారు. అందులో భాగంగానే తొలుత రాహుల్ ను కలిశారు. అదీ సంగతి. మొన్న స్పీకరు సుమిత్ర మహాజన్ ఇంటికి సోనియా - ప్రియాంకలు వెళ్లడానికి కూడా ఇలాంటి కారణమే ఉంది. మహాజన్ మనవరాలికి ప్రియాంక అంటే ఇష్టమట. ఆ సంగతి తన బామ్మ మహాజన్ తో ఆమె చెప్పడంతో ఆమె ఆ విషయాన్ని సోనియాకు తెలిపారట. దాంతో సోనియా అదేం భాగ్యం అంటూ కూతురిని వెంట తీసుకుని స్పీకర్ ఇంటికొచ్చి చాలాసేపు గడిపారు. మొత్తానికి ఆరోపణలు - ప్రత్యారోపణలతో కొట్టుకునే పాలక - విపక్ష నేతలు వ్యక్తిగత విషయాల్లో మంచి సంబంధాలు కొనసాగిస్తుండడం.. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవడం మాత్రం మంచి పరిణామమే.