Begin typing your search above and press return to search.

మా డ‌బ్బుల‌తో మా మీదే పెత్త‌న‌మా జైట్లీ?

By:  Tupaki Desk   |   8 March 2018 4:59 AM GMT
మా డ‌బ్బుల‌తో మా మీదే పెత్త‌న‌మా జైట్లీ?
X
ఏపీ రాజ‌కీయాల‌కు సంబంధించి. కోట్లాది ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌ల వ‌ర‌కు బుధ‌వారం (మార్చి 7 - 2018) కీల‌క‌మైన తేదీగా చెప్పాలి. భ‌విష్య‌త్ రాజ‌కీయాలు.. ఆ మాట‌కు వ‌స్తే భార‌త‌ రాజ‌కీయాల వ‌ర‌కూ ఒక‌కీల‌క‌మైన రోజుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. సాయం అడుగుతున్న రాష్ట్రం గురించి పెద్ద‌న్న కుర్చీలో కూర్చున్న ఒక ప్ర‌భుత్వం ఎలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దో అలా వ్య‌వ‌హ‌రించి తీర‌ని వేద‌న‌ను మిగిల్చిన రోజుగా చెప్పాలి. నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాట‌లు అంటాన‌న్న రీతిలో కేంద్రం వ్య‌వ‌హ‌రించిన తీరు స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డిన రోజుగా చెప్పాలి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సుదీర్ఘంగా మాట్లాడితే.. సాయంత్రం అయ్యేస‌రికి కేంద్ర ఆర్థిక‌మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టేసి.. వెనుకా ముందు చూసుకోకుండా.. బాబు మీద ఉన్న కోపాన్ని.. ఆగ్ర‌హాన్ని ఏపీ ప్ర‌జ‌ల మీద ఎంత నిర్ద‌య‌గా ప్ర‌ద‌ర్శించారో ఆయ‌న మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. సానుభూతి చూపిస్తాం కానీ.. సొమ్ములు ఇచ్చేది లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశారు. ఇంత‌కీ ఆ డ‌బ్బులు ఎవ‌రికి అంటే.. రాష్ట్రాల‌వే. అంటే..ఒక రాష్ట్రం ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి ఇస్తే.. అందులో కొంత భాగాన్ని ఉంచేసుకొని.. మిగిలింది రాష్ట్రాల‌కు ఇస్తుంది. తాను ఉంచుకున్న భాగాన్ని త‌న‌కు తోచిన‌ట్లుగా ఖ‌ర్చు చేయ‌టం తెలిసిందే. సంప‌న్న రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఆదాయాన్ని కొంత‌మేర మాత్ర‌మే ఆ రాష్ట్రానికి ఇస్తూ.. మిగిలింది వెనుక‌బ‌డిన రాష్ట్రాల‌కు ఇవ్వ‌టం మొద‌ట్నించి ఉన్న‌దే. ప‌లు రాష్ట్రాలు క‌లిసి ఒక దేశ‌మ‌న్న భావ‌న‌తో క‌లిసి ఉన్న‌ప్పుడు ఇలాంటివి త‌ప్ప‌వు.

అంతా మ‌నోళ్లే అయిన‌ప్పుడు ఒక‌రికి ఎక్కువ‌.. మ‌రొక‌రికి త‌క్కువ‌న్న భావ‌న పెద్ద‌గా ఉండ‌దు. కానీ.. అధికారంలో ఉన్న వారి త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో అప్ప‌టివ‌ర‌కూ సంప‌న్న రాష్ట్రంగా ఉన్న ఒక రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన‌ప్పుడు దాన్ని చ‌క్క‌దిద్దాల్సింది ఎవ‌రు? ఏపీ ప్ర‌జ‌లు ఎవ‌రూ విభ‌జ‌న‌కు అంగీక‌రించ‌లేదు. ఇష్టం లేద‌న్న విష‌యాన్ని ఓపెన్ గా చెప్పేశారు. అయితే.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని తీర్చ‌టం కోసం ఏపీ విభ‌జ‌న త‌ప్ప‌ద‌ని తేల్చేశారు. మెజార్టీ లేకున్నా.. ప్ర‌జాస్వామ్యాన్ని కామెడీ చేస్తూ.. పార్ల‌మెంటు త‌లుపులు మూసి.. టీవీలో లైవ్ క‌ట్ చేసి మ‌రీ ఏపీని రెండు ముక్క‌లు చేసేశామ‌ని తీర్మానం చేసి పారేశారు. దేశంలో భాగ‌మైన ఒక రాష్ట్రానికి ఇంత అన్యాయ‌మా? అన్న‌ది దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఆగ్ర‌హంతో పాటు.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. తాము అనుకున్న‌ది చేసిన క్ర‌మంలో.. భారీగా న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకునేందుకు ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించారు. అలా ప్ర‌క‌టించింది ఏ అనామ‌కుడో అనుకుంటే ఓకే. వ‌రాలు ఇచ్చింది సాక్ష్యాత్తు దేశ ప్ర‌ధాని. కాకుంటే.. తాను ఇచ్చిన వ‌రాల్ని అమ‌లు చేసే టైం లేక‌.. త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వం అమ‌లు చేసేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక‌వేళ‌.. నాటి వ‌రాల్ని స‌భ‌లో బీజేపీ నేత‌లు ఒప్పుకోకుంటే అదో ర‌కంగా ఉండేది. హోదా ఐదేళ్లు ఇస్తామ‌ని మ‌న్మోహ‌న్ చెబితే.. ఛీ.. ఛీ.. ఐదేళ్లేంది ఛీప్ గా.. మేం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. మా ప్ర‌భుత్వం ప‌దేళ్లు ఇస్తుంద‌ని బీజేపీ త‌ర‌ఫున వ‌క‌ల్తా పుచ్చుకొని మాట్లాడిన వెంక‌య్య పార్ల‌మెంటు సాక్షిగా గొప్ప‌లు చెప్పేశారు.

మ‌రి.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే బీజేపీ.. కేంద్రంలో కొలువు తీరి.. తాము ఇచ్చిన బాస‌ను మ‌రిచిపోవ‌టం ఒక ఎత్తు అయితే.. దాన్ని కామెడీ చేసుకున్న తీరు చూసిన‌ప్పుడు ప్ర‌జాస్వామ్య‌వాదుల క‌డుపు మండ‌టం ఖాయం. అంతేనా.. రాష్ట్రాల సొమ్ముతో పెత్త‌నం చేసే కేంద్రానికి మ‌రీ ఇంత బ‌లుపా? అన్న సందేహం రాక మాన‌దు. త‌మ డ‌బ్బులు ఇచ్చి మ‌రీ త‌మ మీద అధికారం చెలాయించ‌టం.. త‌మ‌ను చుల‌క‌న చేసే కేంద్రానికి..ఆ వ్య‌వ‌స్థ‌కు ఇప్ప‌టికైనా ప‌రిమితులు.. ప‌రిధులు విధించేలా నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లేకుంటే.. ఏపీ గొంతు కోసిన‌ట్లే.. కేంద్రంలోకూర్చున్న వారు ఏ రాష్ట్ర గొంతునైనా నిర్దాక్షిణ్యంగా కోసే ముప్పు పొంచి ఉంద‌ని మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంట‌ప్పుడు మ‌నసులో అనిపించేదేమంటే.. మా డ‌బ్బుల‌తో మీ పెత్త‌నం ఏమిటి? రాష్ట్రాలు క‌ట్టే ప‌న్నుల‌తో ఆ రాష్ట్రాల‌ త‌ల‌రాత‌ల్ని రాయ‌ట‌మా?