Begin typing your search above and press return to search.

సొల్యూషన్ ఉన్నా ఈ సొల్లేంది జైట్లీ?

By:  Tupaki Desk   |   5 Aug 2016 8:07 AM GMT
సొల్యూషన్ ఉన్నా ఈ సొల్లేంది జైట్లీ?
X
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రఆర్థికమంత్రి మాటలు ఏపీ ప్రజలకు చిరాగ్గా మారుతున్నాయి. విషయం చాలా క్లియర్ గా ఉన్నా... అదేదో బ్రహ్మపదార్థంగా అభివర్ణిస్తూ.. సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న తీరు ఏపీ ప్రజల్లో ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా మీద నిరసన వ్యక్తం చేయటం.. వాయిదా తీర్మాన్ని ఇవ్వటం.. జీరో అవర్ లో ఈ అంశాన్ని ప్రస్తావించటం లాంటివి చేసి ప్రత్యేక హోదా మీద తమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు.

హోదా అంశంపై జీరో అవర్ లో ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి.. రెండేళ్లుగా కేంద్రం హోదా ఇవ్వకుండా ఆలస్యం చేస్తుందని.. రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. పరిశ్రమలు లేవని.. పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రావటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు గట్టిగా పట్టుబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమస్యకు పరిష్కార మార్గం వెతకటంలో క్రియాశీలక చర్చ జరుగుతోందని.. ఏపీ ముఖ్యమంత్రితో తాను మాట్లాడానని.. ఏపీ ప్రజలు సంతృప్తి చెందేలా ఒక పరిష్కార మార్గాన్ని నమ్ముకుంటానన్న నమ్మకం ఉందంటూ వ్యాఖ్యానించారు.

జైట్లీ మాటలు విన్నప్పుడు.. ఆయన మాట్లాడే మాటల్లో వేటికీ లాజిక్ చిక్కని పరిస్థితి. ప్రత్యేక హోదా ఇవ్వటానికి కేంద్రానికి ఉన్న ఇబ్బందులేమిటన్నది ఇప్పటివరకూ చెప్పకపోవటాన్ని మర్చిపోకూడదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. మిగిలిన రాష్ట్రాలు సైతం తమను అడుగతాయని.. లేనిపోని సమస్యలు ఎదురవుతాయన్న ఆందోళనలో కూడా అర్థం లేనిదిగా చెప్పొచ్చు. విపక్షాలు బలంగా వ్యతిరేకించిన అంశాల మీద కూడా అధికారపక్షం తాను అవునని అనుకుంటే వాటిని అమలు చేయటాన్ని మర్చిపోకూడదు. ఎవరో ఏదో ఒత్తిడి చేస్తారన్న బూచిని చూపించి.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా జైట్లీ వ్యాఖ్యానించటంలో అర్థం లేదనే చెప్పాలి. అంతేకాదు.. సమస్యకు పరిష్కారం కోసం ఎడతెగని చర్చలు జరపాల్సిన అవసరం లేదు. ఈగోను కాస్త పక్కన పెట్టేసి.. ఏపీకి మొదట చెప్పినట్లుగా ప్రత్యేక హోదా ఇచ్చేస్తే ఇష్యూ క్లోజ్ అయినట్లే. కానీ.. ఆ వాస్తవాన్ని పట్టించుకోని జైట్లీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా అంటే అదేదో బ్రహ్మపదార్థంగా మాటలు చెప్పటం కచ్ఛితంగా సొల్లే అవుతుంది.