Begin typing your search above and press return to search.

జైట్లీ మాట: ప్ర‌త్యేక హోదా ఇవ్వం

By:  Tupaki Desk   |   30 Oct 2015 3:05 PM GMT
జైట్లీ మాట: ప్ర‌త్యేక హోదా ఇవ్వం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా క‌లేనా? స్పెష‌ల్ స్టేట‌స్ ద్వారా ఏపీని ఎంతో అభివృద్ధి చేద్దాం అనుకున్న ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌ల‌లు క‌ల్ల‌లు కావాల్సిందేనా? కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌వ‌ద్ద‌ని డిసైడ‌యిపోయిందా? బిహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌క‌ట‌న అన్ని వ‌ర్గాల‌కు వ‌ర్తిస్తుందా? అనే సందేహాలు ఇపుడు క‌లుగుతున్నాయి.

బిహార్‌ కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌న్న డిమాండ్‌ ను ఆ రాష్ర్ట సీఎం నితీశ్‌ కుమార్ ప‌దే ప‌దే వినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌బోమ‌ని చెప్పారు. అంతేకాదు.... "ప్ర‌త్యేక‌ హోదా ఇచ్చే శ‌కం ముగిసిపోయింది" అని కుంబడ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు వ్యాఖ్యానించారు. బిహార్‌కు సంబంధించి ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ఇత‌ర రాష్ర్టాల‌కు ఇది వర్తిస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కేంద్ర రాష్ర్టాల‌ ఆదాయం పంపిణీకి రాజ్యాంగం ప్ర‌కారం 14వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత ప్ర‌త్యేక హోదా డిమాండ్‌కు అర్థం లేద‌ని పాట్నాలో మాట్లాడుతూ జైట్లీ చెప్పారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకోసం రాజ్యాంగ అవార్డును ప్రకటించి, కేంద్రం, రాష్ర్టాల‌ మధ్య పన్నుల రాబడిని పంచడానికి ఒక ఫార్ములాను రూపొందించిందని ఆయన చెప్పారు. బిహార్ గురించి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించారని, ఇదే కాకుండా ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టుల పూర్తికోసం మరో 40 వేల కోట్లు ప్రకటించారని జైట్లీ చెప్పారు. ‘ఇంతే కాదు. బిహార్‌ కు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రం అనుకుంటోంది’ అని జైట్లీ చెప్పారు.

జైట్లీ చేసిన ప్ర‌క‌ట‌న బిహ‌ర్‌కే ప‌రిమితం అవుతుందా? లేక కేంద్ర ఆర్థిక‌మంత్రి హోదాలో నంబ‌ర్ 2గా ఉన్న జైట్లీ మోడీ మ‌న‌సెరిగి హోదాపై స్పందించారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. బిహార్‌కు ద‌క్కిన ప్యాకేజీని పోల్చుకొని ఏపీ ప్యాకేజీ గురించి ఊహ‌లు వినిపించిన నేప‌థ్యంలో...ప్ర‌త్యేక హోదాపై బిహార్‌కు ఇచ్చిన స్టేట్‌మెంటే ఏపీకి వ‌ర్తిస్తుందా అనేది తేలాల్సి ఉంది.