Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల విషయంలో బీజేపీ బరితెగించినట్లే

By:  Tupaki Desk   |   14 May 2016 1:30 AM GMT
ఆంధ్రోళ్ల విషయంలో బీజేపీ బరితెగించినట్లే
X
ఏపీ ప్రజలంటే కమలనాథులకు ఏ మాత్రం ప్రేమ.. అభిమానం.. సానుభూతి లాంటి ఏ పదార్థాలు లేవని స్పష్టమైంది. మొన్నటికి మొన్న కేంద్రమంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీకి చెందిన పలు పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో వివరణ ఇవ్వటం తెలిసిందే.

కర్ర విరగకుండా.. పాము చావకుండా చెప్పిన మాటలు గడిచి మూడు.. నాలుగు రోజులే అయ్యింది. తాజాగా ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థ్ నాథ్ ఏపీకి వచ్చి.. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న విషయాన్ని స్పష్టం చేయటం చూస్తే.. ఆంధ్రోళ్ల విషయంలో బీజేపీ బరితెగించినట్లేనని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా అన్న పదం విభజన చట్టంలో లేదని.. ఏపీకి హోదా ప్రకటించాలంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయంటూ పాత పాటనే పాడారు.

ఆయన చెప్పిన మాటల్ని విన్న ఏపీ బీజేపీ నేతలు.. పార్టీ సమావేశంలోనే గట్టిగా నిలదీసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. పార్టీ ఇన్ ఛార్జ్ చెప్పిన దానికి తలలు ఊపేసిన నేతల వైనాన్ని చూసిన సిద్దార్థ్.. హోదా విషయంలో ఏపీ అధికారపక్ష నేతలు చెలరేగిపోవటాన్ని ప్రస్తావించి వారిపై ఎదురుదాడి చేయాలన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ అధికారపక్ష వైఫల్యాల్ని ఎండగట్టాలంటూ హితబోధ చేసినట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. చంద్రబాబు వైఫల్యాలే ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు మరుగున పడేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీకి ఎలాంటి ప్రయోజనం కలిగించేందుకు సిద్ధంగా లేనట్లుగా ఉన్న బీజేపీ వైఖరి పట్ల సీమాంధ్రులు ఎలా స్పందిస్తారో..?