Begin typing your search above and press return to search.

జైట్లీ మాట: కుటుంబాల కంటే కార్డులే ఎక్కువ

By:  Tupaki Desk   |   26 Dec 2016 4:54 AM GMT
జైట్లీ మాట: కుటుంబాల కంటే కార్డులే ఎక్కువ
X
నోట్ల రద్దు నిర్ణయం నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు మాత్రమే కాదని.. అది దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసే బహృత్ ప్రణాళిక అన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసేలా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు నిర్ణయంతో చెలామణిలో ఉన్న నగదును తిరిగి తెప్పించుకోవటం.. అనంతరం కరెన్సీని పరిమితంగా విడుదల చేయటం.. అదే సమయంలో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవటం.. పన్ను చట్టాల్ని సవరించటం ద్వారా.. సరికొత్త నిర్ణయాల్ని తీసుకురావటం ద్వారా.. వీలైనంతవరకూ ప్రతి లావాదేవీని రికార్డు చేసేలా విధానాల్ని మార్చటమే లక్ష్యంగా మోడీ సర్కారు పని చేస్తున్నట్లుంది.

ఇందులో భాగంగానే పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించటంతో పాటు.. తదనంతరం ఏం చేయాలో వాటిని అనుకున్నది అనుకున్నట్లే చేశారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా జైట్లీ ఆసక్తికరమైన ఒక వ్యాఖ్యను చేశారు. ఆ మాటను లోతుగా పరిశీలిస్తే.. మోడీ సర్కారు మైండ్ సెట్ ఏమిటో అర్థం కావటమే కాదు.. ఏం చేయాలనుకుంటున్నారన్న విషయం మీదా క్లారిటీ వచ్చేయటం ఖాయం. భారతదేశం నగదురహితం కాలేదని.. అయితే.. తక్కువ నగదు కలిగిన దేశంగా మాత్రం తప్పకుండా అవుతుందన్న మాటను చెప్పేశారు.

తాము అనుకుంటున్న విషయాన్ని ప్రజలు బాగానే అర్థం చేసుకుంటున్నా.. కొన్ని రాజకీయ పార్టీలు..మీడియా సంస్థలు అర్థం చేసుకోవటం లేదని మండిపడ్డ ఆయన.. ఇదంతా అర్థం కావటానికి కొంతకాలం పడుతుందన్నారు. దేశంలో 25 కోట్ల కుటుంబాలు ఉంటే.. డెబిట్.. క్రెడిట్ కార్డులు 75 కోట్లు ఉన్నాయని.. వీటిల్లో 40 కోట్ల కార్డులు సక్రమంగా వినియోగంలో ఉన్నాయన్న లెక్క చెప్పిన జైట్లీ.. ‘‘వాస్తవానికి ప్రతిఒక్కరూ ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా కార్డులతోనే వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు’’ అంటూ క్యాష్ లెస్ లావాదేవీలు ఎలా సాధ్యమన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. కార్డులు.. మొబైల్ ఫోన్లు లేని వారి కోసం ఆధార్ రహిత చెల్లింపుల వ్యవస్థ (ఈ విధానంలో చేతిలో కార్డు లేకున్నా వేలి ముద్రే కార్డుగా సరిపోతుంది)ను ప్రవేశ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జైట్లీ తాజా మాటల్ని చూస్తే.. గతంలో మాదిరి క్యాష్ ప్లో ఉండదన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. క్యాష్ లెస్ లావాదేవీలపై నెగిటివ్ గా జరుగుతున్న ప్రచారంలో అర్థం లేదన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/