Begin typing your search above and press return to search.

‘‘కొరత’’ గుట్టును విప్పదీసిన జైట్లీ..

By:  Tupaki Desk   |   8 Dec 2016 8:00 AM GMT
‘‘కొరత’’ గుట్టును విప్పదీసిన జైట్లీ..
X
పెద్దనోట్లను రద్దు చేసిన మోడీ సర్కారు.. తాము తీసుకున్న నిర్ణయంతో చోటు చేసుకునే పరిణామాల్ని కేంద్రం అంచనా వేసిందా? లేదా? అన్నది ఒక సందేహంగా మారింది. చాలామంది అయితే.. నోట్ల రద్దు వరకూ మోడీ అడుగులు సాఫీగానే పడినా..ఆ తర్వాత మాత్రం పరిస్థితి అదుపు తప్పిందని.. దానికి ఆయన ప్లానింగ్ తప్పుగా పలువురు అభివర్ణిస్తున్నారు. నోట్ల కొరత లేకుండా.. రూ.500నోట్లను విడుదల చేస్తే పోయేదని..కానీ.. కేంద్రానికి ముందుచూపు మిస్ కావటంతో కంగాళీ వాతావరణం ఏర్పడిందని కొందరు తప్పు పడుతుంటే.. మరికొందరు ఈ తప్పంతా ఆర్ బీఐ కారణంగా జరిగిందంటూ విశ్లేషణలు చేసేస్తున్నారు.

కొత్త నోట్లకు తగినట్లుగా ఏటీఎంలను సిద్ధం చేయటం పెద్ద విషయం కాదని తొలుత ఉర్జిత్ పటేల్ చెప్పారని.. ఆయన మాటల్ని నమ్మి ప్రధాని నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించారని.. కానీ.. ఏటీఎంలను సరిదిద్దేందుకు పడుతున్న ఆలస్యమే నోట్ల కొరతకు కారణంగా కొందరు వాదిస్తున్నారు. వీటిల్లో నిజానిజాలను చూస్తే.. అందరి వాదనలు తప్పనే చెప్పక తప్పదు.

నోట్ల రద్దు తర్వాత.. నోట్ల కొరత వచ్చేలా కేంద్రమే చర్యలు తీసుకుందన్న విషయం జరుగుతున్న పరిణామాల్ని చూస్తే నిజమనించక మానదు. నోట్ల కొరతను కేంద్రం సృష్టించటంతో వచ్చే లాభం ఏమిటి? అనవసరంగా పేరు ప్రఖ్యాతులు దెబ్బ తీసుకోవటం మినహా మరేమీ ఉండదన్న మాట వినిపిస్తోంది. కానీ.. అందులోనే అసలు మర్మం ఉందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటమే నగదు కొరతకు అసలు కారణంగా చెప్పొచ్చు. నగదు కానీ ఫ్రీగా పంపిణీ సాగుతుంటే.. నగదు రహిత లావాదేవీల దిశగా ఎవరూ దృష్టి సారించరు. గడిచిన నెల రోజులుగా నగదు పంపిణీ విషయంలో అనుసరించిన చర్యల పుణ్యమా అని.. చిన్న చిన్న కూరగాయల షాపులు మొదలు టీ బంకుల్లో కూడా పేటీఎం క్యాష్.. స్వైపింగ్ యంత్రాలు వచ్చేయటం మర్చిపోకూడదు.

ఇదంతా కూడా ముందస్తుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగానే నగదు కొరతనుసృష్టించారా? అన్న సందేహం కలగకమానదు. ఇదిలా ఉంటే.. తాజాగా అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరేలా ఉన్నాయి.‘‘నగదు కొరత ఉన్నట్లు కొంతమంది భావిస్తున్నారు. కానీ.. డిజిటల్వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఈ కొరత తప్పదు. కొరతను అధిగమించేందుకు ప్రతి రోజు ఆర్ బీఐ కొంత కరెన్సీని విడుదల చేస్తోంది. మీడియా సహా అందరి నుంచి విమర్శలు వస్తున్నా.. చివరకు దాని వల్ల మంచేజరుగుతుంది. చక్కటి ఫలితాలు రానున్నాయి’’ అంటూ చెప్పిన మాటలు వింటే.. క్యూలైన్ల కష్టాలు.. నోట్ల కొరతతో సామాన్యుడు పడుతున్న కష్టాల వెనుక పరమార్థం ఏమిటో తెలుస్తుందని చెప్పొచ్చు.