Begin typing your search above and press return to search.

జైట్లీ అలా అంటే పోలవరం హుళక్కే!

By:  Tupaki Desk   |   20 Dec 2017 3:30 PM GMT
జైట్లీ అలా అంటే పోలవరం హుళక్కే!
X
భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేప్పుడు తెలుగుదేశం నాయకులు సంయమనం పాటించాలంటూ చంద్రబాబు తన వారికి లక్ష రకాలుగా సుద్దులు చెప్పవచ్చు గాక.. కేంద్రం నుంచి ఎన్ని రకాలుగా వంచన బయటపడుతున్నప్పటికీ.. ఇంకా ఏదో ఒరగబెట్టేస్తారని ఆశతో.. వారితో సఖ్యతగా ఉండడానికి ఆయన ప్రయత్నిస్తుండవచ్చు గాక.. కానీ తాజాగా ఢిల్లో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. అసలు పోలవరం పనుల్ని వేగంగా జరిపించడం కాదు కదా.. ఏదో ఒకరీతిగా నడిపించడం కూడా ఒక పట్టాన తెమిలే సంగతి కాదని అనిపిస్తోంది.

భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు నేతృత్వంలో భాజపా నాయకులు కొందరు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఏపీ పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ పోలవరం ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. అయితే అరుణ్ జైట్లీ మాత్రం చాలా స్పష్టంగా చట్టప్రకారం మాత్రమే పోలవరానికి ఇవ్వవలసిన నిధులు ఇస్తాం అంటూ.. సెలవిచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.

అరుణ్ జైట్లీ మాటల అంతరార్థం గమనిస్తే గనుక.. చంద్రబాబునాయుడు సర్కారు ఆశిస్తున్న రీతిలో కేంద్రంనుంచి సహాయం అందడం అనేది కల్ల అని పలువురు విశ్లేషిస్తున్నారు.

‘చట్టం ప్రకారం’ అనే పదానికి అర్థం ఏమిటి. నిర్వచనం ఏమిటి? ఆ సంగతి తేలేలోగా.. ఏళ్లూ పూళ్లూ గడచిపోతాయని.. చంద్రబాబునాయుడు సర్కారు ప్రభుత్వం పోలవరానికి నిధులు అడిగే విషయంలో ముందు జరిగిన ఒప్పందాలతో నిమిత్తం లేకుండా తమ ఇష్టమొచ్చినట్లుగా మార్చేసుకుంటూ వెళితే.. కేంద్రం పట్టించుకోదని... పైసా కూడా విదిల్చదని దీనిద్వారా స్పష్టంగా అర్థమవుతోందని పలువురు పేర్కొంటున్నారు.

ఇటీవల కేంద్రానికి సమర్పించిన నివేదికల ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనా వ్యయం.. 58 వేల కోట్లు పైచిలుకుగా.. రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టం రూపొందిన సమయానికి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన మరియు విభజన చట్టంలో ఆ విషయం పొందు పరిచిన సమయానికి ఉన్న అంచనా వ్యయాలకంటె దాదాపు 30 వేల కోట్లకు పైగా అంచనాలు పెరిగిపోయాయి. మరి అరుణ్ జైట్లీ ఇవాళ చెబుతున్న మాటలకు అర్థం ఏమిటి? ‘చట్టం ప్రకారం’ అనే మాటల ముసుగులో ఆయన విభజన చట్టం లోని అంశాన్ని, ఆనాటి అంచనా వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ఇక పోలవరం అటకెక్కినట్టే. పైగా చంద్రబాబునాయుడు మరోవైపు కొత్త టెండర్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బుతోనైనా చేపడుతాం.. అంటూ రాష్ట్ర ఖజానాపై భారం వేయడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు కీలకమైనవి. రాష్ట్ర రెవిన్యూలోటును కేంద్రం అడ్జస్ట్ చేయడం సంగతి తర్వాత.. ముందు అసలు కేంద్రానికి ఇచ్చిన తాజా అంచనా వ్యయాల విషయంలో కేంద్రం ఆమోదం లభించిందా లేదా? కొత్త టెండర్లకు - లేదా ఆ రకంగా చేపట్టదలచుకున్న పనులకు కూడా కేంద్రమే డబ్బు లిస్తుందా లేదా? అనే అంశాలు తేలితే తప్ప.. పోలవరం భవిష్యత్తుపై క్లారిటీ రాదని పలువురు అంటున్నారు.