Begin typing your search above and press return to search.

ప్రతి పైసా ఇచ్చేది తర్వాత..ముందు బాకీ తీర్చు జైట్లీ

By:  Tupaki Desk   |   5 May 2016 4:23 PM GMT
ప్రతి పైసా ఇచ్చేది తర్వాత..ముందు బాకీ తీర్చు జైట్లీ
X
ఏపీ విషయంలో మోడీ సర్కారు ఏ తీరులో వ్యవహరిస్తుందన్న విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన మాటలతో చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న విషయాన్నికుండబద్ధలు కొట్టిన నేపథ్యంలో తీవ్రంగా ఎగిసిపడ్డ ఆగ్రహావేశాల్ని తగ్గించే ప్రయత్నంలో.. ఏపీకి ప్రత్యేక హోదా మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన జైట్లీ.. అడ్డంగా దొరికిపోయారు. ఏపీకి మోడీ సర్కారు ఎంతమేర సాయం చేస్తుందన్న విషయాన్ని గణాంకాల సహితంగా ఆయన పట్టుబడ్డారు.

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అన్ని హామీల్ని తీరుస్తామని చెప్పే బీజేపీ నేతల మాటల్లో నిజం నేతిబీర చందం అన్న విషయం జైట్లీ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ప్రతిపైసా చెల్లిస్తామంటూ గొప్పలు చెప్పుకునే పనిలో భాగంగా అడ్డంగా బుక్ అయ్యారు. అదెలానంటే.. ఏపీకి తన తొలి ఏడాది వార్షిక లోటును రూ.23వేల కోట్లుగా ప్రకటిస్తే.. తాము రూ.2800 కోట్లు ఇచ్చిన నిజాన్ని ఒప్పుకున్నారు. ఏపీ వెల్లడించిన లోటును పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. తొలి ఏడాది గడిచి మరో ఏడాది పూర్తి కావటమే కాదు.. ఇప్పుడు మూడో ఏడాదిలో అడుగుపెట్టిన పరిస్థితి. గడిచిన రెండేళ్లలో మోడీ సర్కారు ఏపీకి విదిల్చిన లోటు మొత్తం రూ.6500 కోట్ల కంటే తక్కువ కావటం గమనార్హం.

ఓపక్క లోటు వేల కోట్ల ఉంటే.. భర్తీ పేరుతో చిల్లర విదులుస్తున్న కేంద్రం తీరును ఆయన చెప్పకనే చెప్పేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన ప్రతిపైసాను ఇస్తానని చెప్పే జైట్లీ.. ముందు.. గతంలో ఇవ్వాల్సిన లోటు మొత్తాన్ని పూర్తిగా ఇస్తే చాలని చెప్పక తప్పదు. మాటల్లో కోటలు దాటించే జైట్లీ అండ్ కో.. ఏపీకి మాటలతో కడుపు నింపే కన్నా నిధులతో ఖజానా నింపితే బాగుంటుంది. మోడీ సర్కారు లాంటి వారి నుంచి ఆశించటం మరీ అత్యాశే అవుతుంది.