Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో ఉన్నా అరుణ్ జైట్లీ ఆగ్రహం తగ్గలేదు

By:  Tupaki Desk   |   26 May 2018 5:00 PM GMT
ఆసుపత్రిలో ఉన్నా అరుణ్ జైట్లీ ఆగ్రహం తగ్గలేదు
X
ఆసుపత్రిలో ఉన్న బీజేపీ నేత అరుణ్ జైట్లీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆసుపత్రి బెడ్ నుంచే ఆయన తన ఆగ్రహాన్నంతా వెల్లగక్కారు. ప్రధాని మోదీ నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటే ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. దీంతో వారి తీరుపై జైట్లీ మండిపడ్డారు. మోదీ నాలుగేళ్ల పాలన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విశ్వాస ఘాతుక దినోత్సవం పేరిట దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండడాన్నిఅరుణ్‌ జైట్లీ తప్పు పట్టారు. ఫేస్‌ బుక్‌ వేదికగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ భారత ప్రజలు తిరస్కరణకు గురికాక తప్పదంటూ జైట్లీ జోస్యం చెప్పారు.

భారత్‌ వంటి పెద్ద దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని.. అయితే.. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కొనసాగించడం మాత్రం అంత ఈజీ కాదన్నారు. సుస్థిర ప్రభుత్వాలు లేకుంటే నష్టమని అన్నారు. అధికార దాహంతో అరాచక కూటమి ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు.

సంకీర్ణాల కోసం చూస్తున్న పార్టీల గతమేంటో చూస్తే వారు ఎంత నిలకడగలవారో అర్థమవుతుందంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎప్పటికప్పుడు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చే పార్టీలతో ఏర్పడే కూటములు ఎంతోకాలం నిలబడవన్నారు. కర్ణాటకలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌.. చివరి నిమిషంలో ప్రాంతీయ పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేయడం పూర్తిగా దిగజారిపోవడమేనని ఆయన అన్నారు.